రూల్స్ హోమ్‌ మినిస్ట‌ర్ మ‌న‌వ‌డికి వ‌ర్తించ‌వా?

Friday, July 19th, 2019, 01:50:04 PM IST

రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫ‌ర్ ఆల్!! అన్నారు. కానీ తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్నంగా వుంది ప‌రిస్థితి. సోష‌ల్ మీడియా వ‌చ్చాక విచ్చ‌ల‌విడిత‌నం రోజు రోజుకూ ఎక్కువ‌వుతోంది. టిక్ టాక్ వ‌చ్చాక అది మ‌రీ శృతిమించేసింది. ఎవ‌రు ప‌డితే వారు వీడియో షేరింగ్ తో పాపుల‌ర్ అవ్వాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డిపోతున్నారు. సామాన్యుల ద‌గ్గ‌రి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఇదే తంతు. దీనిలోకి పొలిటిక‌ల్ లీడ‌ర్స్ వార‌సులు కూడా వ‌చ్చిచేరుతున్నారు. వాళ్లు చేసే హంగామా మామూలుగా వుండ‌టం లేదు. అయితే వాళ్ల‌కి మాత్రం ఎలాంటి రూల్స్ వ‌ర్తించ‌డం లేదు. ఇటీవ‌ల ఖ‌మ్మంలో మున్సిప‌ల్ సిబ్బంది ప‌ని చేస్తూ ఆఫీస్ ఆవ‌ర‌ణ‌లోనే టిక్ టాక్ వీడియోలు చేశారు.

ఆఫీస్ స‌మ‌యంలో సినిమా పాట‌లు పాడుతూ, సినిమా డైలాగ్‌లు చెబుతూ టిక్ టాక్ వీడియోలు చేశారు. అదీ ఆఫీస్ పని వేళ‌లో.. అయితే దీని వ‌ల్ల వారు ఎవ‌రి స‌నికి ఎలాంటి ఇబ్బందిని క‌లిగించ‌లేదు. కానీ ఈ టిక్ టాక్ వీడియోపై నెటిజ‌న్‌లు విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఆ వీడియోలు కాస్తా వైర‌ల్‌గా మారి వివాదానికి దారితీశాయి. దీంతో వారిని ఖ‌మ్యం మున్సిప‌ల్ ఆఫీస‌ర్ విధుల నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిసింది. తాజాగా ఇలాంటి వీడియోనే తెలంగాణ హోమ్ మినిస్ట‌ర్ మ‌హ‌మూద్ అలీ మ‌న‌వ‌డు చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలాడు. ఇది వైర‌ల్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ వీడియోలో అధికారిక వాహ‌నంపై కూర్చుని ఓ యువ‌కుడు వుండ‌గా మ‌హ‌మూద్ అలీ మ‌న‌వ‌డు టిక్ టాక్ వీడియోని షూట్ చేయ‌డం అధికార దుర్విన‌యోగం చేయ‌డ‌మే అంటే విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. మున్సిప‌ల్ సిబ్బందికి ఓ రూల్ మినిస్ట‌ర్ మ‌న‌వ‌డికి ఓ రూలా అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు.