గ్రామీ సాక్షిగా సంగీతంలో మ‌న వెన‌క‌బాటు!

Monday, January 29th, 2018, 10:00:12 PM IST

సంగీతంలో.. గానంలో ప్ర‌తిభ‌కు ఇచ్చే అవార్డులు గ్రామీ అవార్డులు. ప్ర‌తియేటా గ్రామీలు ఇస్తూనే ఉన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తిభావంతులు నిరూపించుకుంటూనే ఉన్నారు. అయితే గ్రామీలు కేవ‌లం విదేశీయుల‌కు మాత్ర‌మేనా? వాటికి మ‌న భార‌తీయులు అర్హులు కారా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతూనే ఉంది. ఇప్ప‌టికే 60 సంవ‌త్స‌రాలుగా ఈ అవార్డులు ఇస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ల‌లో అస‌లు గ్రామీల్లో మ‌న భార‌తీయుల ప్ర‌భ అన్న‌దే లేదు. అయితే ఈ దుస్తితి ప‌రిశీలిస్తే సంగీత ప్ర‌పంచంలో మ‌నం మ‌రీ అంత వెన‌క‌బ‌డి ఉన్నామా? అన్న సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. సార్వ‌జ‌నీన‌త‌, విశ్వ వేదిక‌కు స‌రిప‌డే సంగీత ప‌రిజ్ఞానం మ‌న‌కు లేదా? అంటే ప్ర‌పంచాల్ని ఏలిన గొప్ప సంగీత‌జ్ఞులు మ‌న‌కు ఉన్నారు. కానీ ఏం లాభం? గ‌్రామీల్లో మ‌న ప్ర‌భ క‌నిపించ‌నే క‌నిపించ‌దు. ఏ.ఆర్‌.రెహ‌మాన్ లాంటి అరుదైన ట్యాలెంటు మిన‌హా మ‌న‌కు గ్రామీలు తెచ్చే మొన‌గాళ్లు లేరా? అన్న సందేహం క‌లుగుతుంది. అయితే రెహ‌మాన్ త‌ర్వాత మ‌ళ్లీ అంత వేవ్‌తో వ‌చ్చిన వేరొక సంగీత ద‌ర్శ‌కుడు లేరు. ప్ర‌పంచ స్థాయిలో ఆలోచించి, ప్ర‌తిభ‌తో నెగ్గుకొచ్చేవాళ్లు క‌నిపించ‌డం లేదు. పండిట్ ర‌వి శంక‌ర్‌, జాకీర్ హుస్సేన్‌, విక్కు వినాయ‌క్‌, విశ్వ‌మోహ‌న్ భ‌ట్ వంటి వారికి మాత్ర‌మే ఇండియా నుంచి గ్రామీలు ద‌క్కాయి.

అప్ప‌ట్లో రెహ‌మాన్ `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్‌` సాంగ్ జ‌య‌హోకి మాత్ర‌మే గ్రామీ ద‌క్కింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ మాటే వినిపించ‌లేదు. ఇక లేటెస్టుగా 60వ గ్రామీ అవార్డుల్లో మ‌న భార‌త‌దేశం త‌ర‌పున పోటీకి వెళ్లారా? అంటే అస్స‌లు జ‌నాల‌కు తెలీనే తెలీదు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ విడుదల చేసిన `అనంత వాల్యూమ్‌–1 మెస్ట్రోస్‌ ఆఫ్‌ ఇండియా` శాస్త్రీయ సంగీత ఆల్బమ్‌ 60వ గ్రామీ అవార్డుల `వరల్డ్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌` పోటీకి ఎంపి కైంది. అయితే ఇది పోటీబ‌రిలో నిల‌వ‌లేక‌పోయింది. మొత్తానికి మ‌న సంగీతం గ్రామీల‌కు స‌రిపోదు అని మ‌రోసారి ప్రూవైంది. 120 కోట్ల మంది భార‌తీయులు ఉన్న మ‌న దేశంలో మ‌నం సంగీత విజ్ఞానంలో ఇంత వెన‌క‌బ‌డి ఉన్నామా?