వైసీపీలో నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కం షురూ!

Thursday, June 13th, 2019, 12:02:52 PM IST

ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌లేద‌ని అసంతృప్తితో వున్న కీల‌క నేతల్ని సీఎం వైఎస్ జ‌గ‌న్ దువ్వ‌డం మొద‌లుపెట్టారు. తాడేప‌ల్లి లోని త‌న నివాసానికి పిలిపించుకుని బుజ్జ‌గింపులు మొద‌లుపెట్టిన సీఎం వ‌రుస‌గా వారికి నామినేటెడ్ ప‌ద‌వులు కేటాయించ‌డం ప్రారంభించారు. వైసీపీలో కీల‌క నేత‌గా ఎదిగిన న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో గ‌త కొన్ని రోజులుగా వైఎస్ జ‌గ‌న్‌పై అల‌క‌బూనిన విష‌యం తెలిసిందే. తాజాగా తాడేప‌ల్లి పిలిపించుకున్న జ‌గ‌న్ ఆమెకు ఏపీఐఐసీ ప‌ద‌విని కేటాయించ‌డంతో బెట్టువీడి మెట్టుదిగారు. త‌న‌కు ఆ ప‌ద‌విని కేటాయించ‌డంపై ఆనందాన్ని వ్య‌క్తం చేసిన రోజా ఫేస్ బుక్‌లో కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

ఇక వైఎస్ జ‌గ‌న్ బాబాయ్ వైవీ సుబ్బారె్డ్డి కూడా త‌న‌కు పార్టీలో స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని ఎన్నిక‌లకు ముందు నుంచి జ‌గ‌న్‌పై ఆసంతృప్తిని వెల్ల‌డిస్తూ వున్నారు. మాన‌సికంగా కృంగిపోయిన ఆయ‌న ప్ర‌శాంత‌త కోసం కొన్ని రోజులు విదేశాలు వెళ్లొచ్చారు. అయితే ఆయ‌న‌ని ఎలాగైనా శాంత ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించుకున్న ఏపీ సీఎం జ‌గ‌న్ తీతీదే చైర్మ‌న్‌గా నియిమించిన‌ట్లు, ఆయ‌న పేరునే ఖ‌రారు చేసిన‌ట్లు తెలిసింది. వైవీ సుబ్బారెడ్డికి దైవ‌భ‌క్తి ఎక్కువ‌. అది గ‌మ‌నించిన సీఎం జ‌గ‌న్ సుబ్బారెడ్డికి తీతీదే చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో రెండు మూడు రోజుల్లో అధికారికంగా ప్ర‌ట‌క‌న వెలువ‌డే అవ‌కాశం వుంది. రోజాకు కూడా ఏపీఐఐసీ ప‌ద‌విని కేటాయిస్తూ త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు జారీ చేయ‌బోతున్నారు. వీరితో పాటు ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని నియ‌మించ‌డానికి రంగం సిద్ధ‌మైంది. వీరితో పాటు మ‌రి కొంత మందికి నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం ప్రారంభం కాబోతోంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.