ల‌బోదిబోమంటూ రాజీనామాలు చేస్తుండ్రు!!

Sunday, June 2nd, 2019, 12:11:33 PM IST

అధికారం చేజారితే అది ఎంత బాధాక‌ర‌మో తాజాగా ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తున్న‌వారిని చూస్తే అర్థ‌మ‌వుతోంది. త‌మ‌కు అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన పార్టీ నామ రూపాల్లేకుండా పోవ‌డంతో ఆయాచితంగా వ‌చ్చిన ప‌ద‌వుల నుంచి త‌ప్పుకోవాల్సి రావ‌డం హృద‌య‌విదార‌కంగా మారింద‌ట‌. పాపం పైకి చెప్పుకోక‌పోయినా ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తూ లోలోన ప‌లువురు తేదేపా నాయ‌కులు కుమిలిపోతున్నార‌ట‌. కొత్త సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌దైన శైలిలో ఎటాకింగ్ గేమ్ స్టార్ట్ చేయ‌డంతో ఇన్నాళ్లు ప‌ద‌వుల్ని అనుభ‌వించిన వాళ్లంతా ఒక్కొక్క‌రుగా రాజీనామా లేఖ‌ల‌పై సంత‌కాలు చేస్తూ … లోలోన బోరుమంటున్నార‌ట‌.

ఈ జాబితాలో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఎస్వీబీసీ చానెల్ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయ‌న‌తో పాటు… జ‌లీల్ ఖాన్ తాజాగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తూ లేఖ‌పై సంత‌కం చేశాడు. వైకాపాలో గెలిచి తేదేపాకి మారి అక్క‌డ వ‌క్ఫ్ బోర్డ్ ఛైర్మ‌న్ ప‌ద‌విని వెల‌గ‌బెట్టిన జ‌లీల్ ఖాన్ ఇదివ‌ర‌కూ `బీకాంలో ఫిజిక్స్` పేరుతో కామెడీ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా తేదేపా అధికారం కోల్పోవ‌డంతో రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించారు. ఆయ‌న‌తో పాటు పలువురు నామినేటెడ్ పోస్టులు వ‌దులుకుని బోరుమంటున్నారని తెలుస్తోంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద్ తాజాగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అలాగే దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇదివ‌ర‌కూ ఏపీ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పెమ్మసాని నరసింహారావు , ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(ఈడీబీ) ఎగ్జిక్యూటీవ్ వైస్ చైర్మన్ పదవికి ఎస్పీ టక్కర్ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. అలాగే ఏపీఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ అంబికా కృష్ణ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం మ‌రో హాట్ టాపిక్. ఇక కొత్త గ‌వ‌ర్న‌మెంట్ త‌మ పార్టీ వారికి ఈ ప‌ద‌వుల‌న్నిటినీ క‌ట్ట‌బెడుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే.