తూచ్.. జిల్లాలు లేవు గిల్లాలు లేవు

Saturday, September 13th, 2014, 07:02:45 PM IST


ఆదిలోనే ఆగిపోయింది. మొదలు కాకుండానే వాయిదా పడింది. నేతల ఆశలు అలా ఎగిసి…వెంటనే ఆవిరయ్యాయి.. ఏమిటా ఆశలనుకుంటున్నారా.. జిల్లాల పునర్వవస్థీకరణ. కొత్త జిల్లాలు ఏర్పడుతాయి.. నిధులు సమకూరుతాయి.. నియోజక వర్గాల్లో పరపతి పెరుగుతుందనకున్న పార్టీ నేతల ప్రణాళికలకు ముఖ్యమంత్రి కేసిఆర్ చెక్ పెట్టారు.

కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్ కొత్తది కాదు. పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు జిల్లా కేంద్రాలు అందుబాటులో ఉండడం కోసం.. రాష్ట్రంలో మరిన్ని జిల్లాలు ఏర్పాటు కావాలని ఉమ్మడి రాష్ట్రం నుంచే డిమాండ్ ఉంది.అయితే జిల్లాల ఏర్పాటులో అనేక సమస్యలున్నాయని, వీటి ఏర్పాటు ఆర్ధిక వనరులతో కూడుకుందని ఆయా ప్రభుత్వాలు కొత్త జిల్లాల ఏర్పాటుపై మీన మేషాలు లెక్కించాయి. చివరకు తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టోలోనే కొత్త జిల్లాల ఏర్పాటు అంశం చోటు చేసుకోవడం… ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే వీటిపై కదలిక రావడంతో.. పార్టీ నేతల్లో కొత్త ఆశలు రేకెత్తాయి.

తమ నియోజక వర్గాలకు దగ్గరగా జిల్లా కేంద్రాలు ఏర్పడడం, నియోజక వర్గాల్లోని మండలాల సంఖ్య కూడా తగ్గడం వల్ల భవిష్యత్ లో భారం తగ్గుతుందని ఊహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొంత బలం పెరుగుతుందని కూడా భావించారు. వీటికి తోడు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల… జిల్లా కేంద్రాలు అభివృద్ది చేయాల్సి ఉంటుందని, దీనివల్ల నియోజక వర్గానికి నిధులు సమకూరుతాయని, అనేక మంది ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పన జరిగి అభివృద్ది కనిపిస్తుందని ఆశించారు. ఇదంతా ప్రభుత్వం వచ్చిన ఇంత తక్కువ సమయంలో మొదలు కావడంతో పార్టీ నేతలకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. పనిలో పనిగా తమ నియోజక వర్గ పరిధిలో కూడా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. అయితే వీరి ఆశలను మరికొంత కాలం ఆపుకోవాలంటూ టిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ట్విస్ట్ ఇచ్చారు. నియోజక వర్గాల పునర్వవస్థీకరన జరిగేంత వరకు కొత్త జిల్లాల ఏర్పాటు అంశమే తెరమీదకు రాదని తేల్చేశారు..

మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది తెలంగాణ జిల్లాల పునర్వవస్థీకరణ పరిస్థితి. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్వవస్థీకరణ.. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు అంటే.. ఇప్పట్లో జరగేదికాదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. నియోజకవర్గాలను పునర్వవస్థీకరించేది కేంద్రమని, మనకున్న తొందర కేంద్రానికి ఉండదని, అది జరిగే వరకు జిల్లాలను ఏర్పాటు చేయలేమంటే.. ఇప్పట్లో కొత్త జిల్లాలు రావనే నిర్ణయానికి వచ్చారు పార్టీ నేతలు. 2007లోనే డీలిమిటేషన్ జరిగిందని, మళ్లీ డీలిమిటేషన్ జరగాలంటే కేంద్రం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెబుతున్నారు. తెలంగాణలో 117 నియోజక వర్గాలను 150 నియోజక వర్గాల వరకు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో వెసులుబాటు కల్పించారని… అయితే దానిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. దీంతో ప్రస్తుతం నూతన జిల్లాల ఏర్పాటు అంశం అటకెక్కినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అనేక వాగ్ధానాలు రాష్ట్ర పరిధిలో లేవని.. వాటిని అమలు చేయడం అంత సులువు కాదని… విపక్షాలు చేస్తున్న విమర్శలకు రోజురోజు బలం చేకూరుతోంది. మైనారిటీలకు రిజర్వేషన్ పెంపు, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ వంటివి కేసిఆర్ చెప్పినట్లు జరగవని, కేంద్రం అనుకున్నట్లు అవుతాయని అంటున్నారు. మరి కేసిఆర్ వీటి విషయంలో ఎలా తన వాదనను నెగ్గించుకుంటారో వేచి చూడాలి.