షాకింగ్‌ : లెజెండ్స్‌ ఎన్టీఆర్-ఏఎన్నార్ కార్ రైడింగ్‌

Wednesday, March 14th, 2018, 08:00:10 PM IST

లెజెండ్స్‌ ఎన్టీఆర్-ఏఎన్నార్ వింటేజ్ కార్ రైడ్ చూశారా? ఒకే ఒక్క ఫోటో వంద‌ల ప్ర‌శ్న‌ల్ని అభిమానుల ముందుంచింది. నాడు మ‌ద్రాసు నుంచి ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్‌కి షిఫ్ట‌య్యేప్పుడు అస‌లు హైద‌రాబాద్ ఎలా ఉండేదో ఆవిష్క‌రించే అరుదైన ఫోటోని నేడు నాగార్జున ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో స‌మాధాన‌మే లేని వేన‌వేల ప్ర‌శ్న‌ల్ని వీక్ష‌కుల ముందుంచింది.

నాడు కేబీఆర్ పార్క్ ప‌రిస‌రాలు ఎలా ఉండేవి? జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి వ‌చ్చే దారి ఎలా ఉండేది? వ‌ంటి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఈ పోటో ఆవిష్క‌రించింది. ఇప్పుడంటే ఆ ఏరియా అంతా కార్పొరెట్ మ‌యం అయిపోయింది.. షాపింగుల మ‌యం అయిపోయింది.. ర‌ద్దీ ర‌హ‌దారి తో స‌త‌మ‌త‌మ‌వ్వాల్సి వ‌స్తోంది కానీ, నాడు పూర్తిగా స‌న్నివేశం వేరేగా ఉండేది.
అప్ప‌ట్లో అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌రిస‌రాల్లో అస్స‌లు క‌ట్ట‌డాలే లేవు. భారీ భ‌వంతి అనేది అస‌లు లేనేలేదు. ఎటు చూసినా రాళ్లు ర‌ప్ప‌లు.. కొండ‌లు.. తుప్ప‌లు త‌ప్ప వేరే ఏమీ ఉండేవి కావు. కేబీఆర్ పార్క్ నుంచి చూస్తే, దూరంగా ఉన్న అన్న‌పూర్ణ స్టూడియోస్ ఒక్క‌టే క‌నిపించేది. మ‌ధ్య‌లో రాళ్ల గుట్ట‌లు ద‌ర్శ‌న‌మిచ్చేవి. కానీ ఇప్పుడు ఆ స‌న్నివేశం పూర్తిగా మారిపోయింది. ఈ ఫోటో చూశారు క‌దా.. కేబీఆర్ పార్క్ ప్ర‌హారీ గోడ‌కు, దూరంగా క‌నిపిస్తున్న అన్న‌పూర్ణ స్టూడియోకు మ‌ధ్య‌లో రోడ్‌పై రైడింగుకి వెళుతున్నారు లెజెండ్స్ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌. నాడు ఏ చీకూ చింతా లేకుండా ఖాళీ రోడ్‌లో టింగురంగా అంటూ ప‌య‌నిస్తున్నారు. ఆ రెడ్ క‌ల‌ర్ వింటేజ్ కార్ నాటిరోజుల్లో షూటింగుల్లో బాగా ఉప‌యోగించేవారు. ఈ రేర్‌ ఫోటోని కింగ్ నాగార్జున ట్విట్ట‌ర్‌లో షేర్ చేసి, నాటి జ్ఞాప‌కాల్లోకి తీసుకెళ్ల‌డం విశేషం. చెక్ పోస్ట్ నుంచి రైడ్ అద్భుతంగా సాగింద‌ని అర్థ‌మ‌వుతోంది.