మామ‌తో అల్లుడి మంత‌న‌మేంటో?

Thursday, September 13th, 2018, 03:45:01 PM IST

మామ ఎన్టీఆర్ పాలిట‌ అల్లుడు చంద్ర‌బాబు విల‌న్ అయ్యాడ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ‌ చ‌రిత్ర చెబుతోంది. లక్ష్మీ పార్వ‌తి చేతిలోకి తెలుగు దేశం పార్టీని వెళ్లిపోకుండా కాపాడిన దేవుడ‌ని చంద్ర‌బాబుని ఒక వ‌ర్గం పొగిడేస్తే, వేరొక వ‌ర్గం మాత్రం మామ‌కు వెన్నుపోటు పొడిచిన భయంక‌ర అల్లుడిగా చంద్ర‌బాబును పోల్చింది. కుటిల రాజ‌కీయ నీతిలో వాస్త‌విక నిర‌తిని గ్ర‌హించి ఏం చేస్తే సీఎం పీఠం త‌న‌కు ద‌క్కుతుందో నాడు చంద్ర‌బాబు నాయుడు అదే చేశారు. పీఠంతో పాటు తేదేపాని చేతిలోకి తీసుకోవ‌డం ఓ చ‌రిత్ర‌కే సాక్ష్య‌మైంది. అయితే అంత‌కుముందు మామ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న ఆస్థానంలో తేదేపా నాయ‌కుడిగా కీల‌క బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్‌తో ఎలాంటి స‌త్సంబంధాలు నెరిపేవారో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. ఆ ఎపిసోడ్స్‌ని ఎన్టీఆర్ చిత్రంలో వీక్షించే అవ‌కాశం ఉంద‌ని తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ చెబుతోంది.

వినాయ‌క చ‌వితి కానుక‌గా `ఎన్టీఆర్` చిత్రంలోంచి మామ‌-అల్లుళ్ల‌ లుక్ ఒక‌టి నేడు రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ ఎన్నో సందేహాల్ని, అనుమానాల్ని రేకెత్తిస్తోంది. నంద‌మూరి మామ‌- నారా అల్లుడుగా నంద‌మూరి బాల‌కృష్ణ – ద‌గ్గుబాటి రానా కాంబో అద్భుతంగా కుదిరారు. అయితే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా లాలూచీ ఏంటో?.. ఆ సీక్రెట్ రాజ‌కీయాలేంటో? బ‌య‌ట‌కు తెలియాల‌ని అభిమానులు భావిస్తున్నారు. క్రిష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌ర‌క‌త‌మ‌ణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. చంద్ర‌బాబు పాత్ర‌లో రానా లుక్ అద్భుతంగా కుదిరింది. ఆ చీక‌టి షేడ్‌లో బాల‌కృష్ణ లుక్‌ అచ్చం ఎన్టీఆర్‌ని పోలి క‌నిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments