అన్న గారు కథానాయకుడా? లేక ప్రజా నాయకుడా.?

Thursday, October 4th, 2018, 07:11:37 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “యన్.టీ.ఆర్”. నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర మీద సినిమా అనగానే యావత్తు తెలుగు చిత్ర పరిశ్రమ పులకరించిపోయింది.దానికి తోడు ఆ మహామవుని యొక్క పాత్రని ఆయన తనయుడు బాలకృష్ణే పోషిస్తున్నారు అని తెలియగానే నందమూరి అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు.దానికి తగ్గట్టుగానే క్రిష్ కూడా చాలా జాగ్రత్తగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా అర్ధమవుతుంది.ఎందుకంటే దర్శకుడు క్రిష్ మరియు అందులో ప్రధాన పాత్ర దారుడు రానా సంక్రాంతి కానుకగా ఒక భాగాన్ని మరియు అదే నెలలో గణతంత్ర దినోత్సవం రోజున ఒక భాగాన్ని విడుదల చేస్తున్నట్టుగా సూచనలు ఇచ్చారు.ఈ రెండు భాగాలకు గాను “యన్.టీ.ఆర్ కథానాయకుడు” అని ఒక టైటిల్ “యన్.టీ.ఆర్ ప్రజా నాయకుడు” అని మరో టైటిల్ ఖరారు చేసి ఆ పోస్టర్లను విడుదల చేశారు.

జనవరి 9 పండుగ సమయంలో అన్న గారి వెండి తెర జీవితాన్ని, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్న గారి రాజకీయ జీవితాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ చిత్రం కోసం మాత్రం ప్రతీ ఒక్క తెలుగు పౌరుడు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.