పిక్‌టాక్‌ : స్పెషల్ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ హెవీ వర్కౌట్…

Friday, April 6th, 2018, 01:09:49 PM IST

పాత్ర కోసం ప్ర‌యోగాలు చేసే హీరోల‌లో ఎన్టీఆర్ ఒక‌రు. త‌న క్యారెక్ట‌ర్‌ని బ‌ట్టి శ‌రీర సౌష్ట‌వాన్ని సింపుల్‌గా మార్చుకోగిలిగే స‌త్తా ఎన్టీఆర్‌లో ఉంది. సింహాద్రి టైంలో బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ యమ దొంగ‌, కంత్రి చిత్రాల‌లో స్లిమ్‌గా క‌నిపించాడు. ఇక రీసెంట్‌గా వ‌చ్చిన జై ల‌వ‌కుశ చిత్రంలో కాస్త ఒళ్లుతోనే క‌నిపించాడు. అయితే త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్‌తో చేయ‌నున్న సినిమా కోసం మేకోవ‌ర్ పూర్తిగా మార్చుకుంటున్నాడు. ప్ర‌ముఖ హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వ‌ర్యంలో భారీ వ‌ర్క‌వుట్స్ చేస్తూ కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇటీవ‌ల ఎన్టీఆర్ లుక్‌కి సంబంధించి ఓ ఫోటో పోస్ట్ చేసిన లాయిడ్‌ రీసెంట్‌గా మ‌రో ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. న‌రాలు బిగ‌ప‌ట్టి మరీ త‌న దేహ‌దారుడ్యాన్ని పెంచుకునేందుకు వ‌ర్కవుట్స్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ డెడికేష‌న్ చూసిన ఫ్యాన్స్, సెల‌బ్రిటీస్ ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న మ‌ల్టీ స్టార‌ర్‌లోను న‌టించ‌నున్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల తెలుగు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ఐపీఎల్‌ ప్ర‌క‌ట‌న‌లో న‌టించి అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments