అఫీషియల్ వీడియో : ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడి ప్రకటన!

Sunday, May 27th, 2018, 06:59:08 PM IST

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నట రత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ఇటీవల ఎంతో వైభవంగా సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ చిత్రానికి తొలుత దర్శకుడిగా ప్రేమ కథాచిత్రాల స్పెషలిస్ట్ తేజ ను తీసుకున్నారు. చిత్ర ప్రారంభ సమయంలో వున్న తేజ, ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్ర దర్శకత్వం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే అప్పటినుండి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేదానిపై ఇప్పటివరకు సందిగ్ధత నెలకొంటూ వస్తోంది. అప్పట్లో దర్శకేంద్రులు కె. రాఘవేంద్ర రావు వంటి ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి.

అలానే కొందరైతే స్వయంగా బాలకృష్ణ మెగా ఫోన్ పట్టి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తారని అనుకున్నారు. అయితే మొత్తానికి ఈ చిత్ర దర్శకుడిగా నేడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ)ను అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక వీడియో విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ వాయిస్ ఓవర్ తో నాటి శ్రీరాముని కథను ఆ లవకుశులు చెపితే నేటి ఈ రాముని కథను ఆయన కుమారులమయిన మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము. నా నూరవ చిత్రాన్ని దర్శకత్వం వహించిన క్రిష్ తో ఈ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది మా కలయికలో వస్తున్న రెండవ చిత్రం, తప్పకుండా మిమ్మల్ని అలరించి మంచి విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు…..

  •  
  •  
  •  
  •  

Comments