నాటి హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్ … ఆమె కూతురు ఫస్ట్ ఇన్నింగ్స్??

Thursday, April 5th, 2018, 11:43:01 PM IST


మొన్నటి హీరోయిన్ లయ అనగానే మనకు గుర్తుకొచ్చే సినిమా ప్రేమించు. ఆ సినిమాలో అంధురాలి పాత్రలో ఆమె నటన నిజంగా అద్భుతం అని చెప్పాలి. తెలుగులో పరభాషా హీరోయిన్లు పెరిగిపోయి, రాజ్యమేలుతున్న సమయంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి లయ అని చెప్పాలి. స్వయంవరం చిత్రంతో టాలీవుడ్లో హీరోయిన్ గా ఎంటరై ఇచ్చిన ఆమె ఆతరువాత పలు విజయవంతమయిన చిత్రాల్లో నటించారు. ఆతరువాత పెళ్లి చేసుకుని సినిమాలకి వీడ్కోలు చెప్పిన ఆమె ఇప్పుడు మళ్లీ తెలుగు తెర మీదకు రానున్నట్లు తెలుస్తోంది.

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న నూతన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడానికి సిద్ధమవుతున్నారట. లయకి ఇది రెండో ఇన్నింగ్స్ అయితే, ఆమె కూతురు శ్లోకాకి మొదటి ఇన్నింగ్స్. అవునండి, లయ కూతురు శ్లోకా కూడా ఈ సినిమాతో టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగ్రేటం చేస్తోందట. నిజానికి 1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచారు లయ. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో కనిపించిన లయ శివాజీ నటించిన ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ సినిమాలో చివరిగా చిన్న అతిథి పాత్రలో కనిపించారు.

లయ పెళ్లయిన తర్వాత అమెరికాలోనే సెటిలైంది. ఇక అమర్ అక్బర్ ఆంటోని సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం అక్కడే జరుపుకోబోతోంది. దాంతో ఈ సినిమాలో నటించేందుకు లయ ఒప్పుకుందని టాక్. మరి వేరే సినిమా అవకాశాలు వస్తే ఒప్పుకుంటారా లేదా అనేది తెలీదు. కాగా ఇంతకు ముందు త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలోనూ లయను నటింపచేయాలని చూశారని, దానికామె ఒప్పుకోలేదని టాక్ వినిపించింది….