ఒకే రోజు… ఐదు సినిమాలు, మ‌రి థియేట‌ర్లూ?

Thursday, September 29th, 2016, 03:00:33 AM IST

movies
ఒక రోజు రెండు సినిమాలు విడుద‌లైతేనే థియేట‌ర్ల స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంటుంది. మాకు త‌క్కువ‌, వాళ్ల‌కు ఎక్కువ‌, మాకు బాలేని థియేట‌ర్లు, వాళ్ల‌కు బాగున్న‌వి అంటూ గొడ‌వలు జ‌రిగిపోతుంటాయి. అలాంటిది ఒకే రోజు ఐదు సినిమాలు విడుదలైతే ఇక ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. ద‌స‌రాని పుర‌స్క‌రించుకొని ఒకే రోజు ఐదు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. హాలీడేస్ ఉంటాయి కాబ‌ట్టి రెండు మూడు సినిమాలు విడుద‌లైనా చూస్తారనుకోవ‌చ్చు. కానీ ఒకేసారి ఐదంటే ప్రేక్ష‌కుడికి కూడా మొహం మొత్తేయ‌దూ! కానీ అవేవీ ప‌ట్టించుకోకుండా సిద్ధ‌మైన చిత్రాల్ని విడుద‌ల చేసేందుకే మొగ్గు చూపుతున్నారు నిర్మాత‌లు. ఈడు గోల్డ్ ఎహే, ప్రేమ‌మ్‌, అభినేత్రి, జాగ్వార్‌, మ‌న ఊరి రామాయ‌ణం చిత్రాలు ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌రు 7గా విడుద‌ల తేదీని ఫిక్స్ చేశాయి. ఇప్ప‌టికే మా సినిమాల‌కి థియేట‌ర్లు దొర‌క‌డం లేదో అని గ‌గ్గోలు పెడుతున్నారు చిన్న నిర్మాతలు. కొద్దిమంది పెద్ద నిర్మాత‌లు కూడా వాళ్ల సినిమాల‌కి థియేట‌ర్లు దొర‌క‌లేదంటే గుత్తాధిప‌త్యం అంటూ గుస్సా అవుతూనే ఉంటారు. రోజు రోజుకీ ఆ స‌మ‌స్య పెరిగి పెద్ద‌ద‌వుతూనే ఉంది కానీ… త‌గ్గ‌డం లేదు. సినిమాల విడుద‌ల విష‌యంలో స‌రైన ప్ర‌ణాళిక లేక‌పోవ‌డ‌మే ఈ స‌మ‌స్య‌కి కార‌ణ‌మ‌ని పరిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతుంటాయి. ద‌స‌రా సెల‌వులు ఉంటాయి కాబ‌ట్టి సినిమా కొన్ని థియేట‌ర్ల‌లో విడుద‌లైనా వ‌సూళ్లు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కంతో నిర్మాత‌లు అదృష్టాన్ని ప‌రీక్షించుకొనేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ పెద్ద బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే చిత్రాల‌కి మాత్రం ఈ తర‌హా కాంపిటీష‌న్ ప్ర‌మాద‌మే. ఇప్ప‌టికైనా నిర్మాత‌లు విడుద‌ల తేదీల్ని బాలీవుడ్ త‌ర‌హాలో ముందస్తుగా బుక్ చేసుకొంటే కొంత‌లో కొంత‌వ‌ర‌కైనా స‌మ‌స్య తీరుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతుంటాయి.

  •  
  •  
  •  
  •  

Comments