ఏపీకి కేంద్రం ల‌క్ష కోట్ల‌ బాకీ ఉందా?

Sunday, June 9th, 2019, 06:18:00 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త సీఎం అన్ని గుట్టు మ‌ట్లు బ‌య‌టికి లాగుతుండ‌డం సెన్సేష‌న్ గా మారుతోంది. ఓవైపు తెలుగు దేశం ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన స్కామ్ లు- స్కీమ్ ల‌ను ఎండ‌గ‌డుతూనే.. మ‌రోవైపు కేంద్రం దొంగాట‌కాన్ని వైయ‌స్ జ‌గ‌న్ ప్రశ్నించేందుకు సిద్ధం అవుతుండ‌డం వేడెక్కిస్తోంది. మునుముందు కొత్త సీఎం జ‌గ‌న్ తీవ్ర‌మైన‌ వార్ జోన్ లోకి వెళుతున్నారని తాజా స‌న్నివేశం చెబుతోంది. కేవ‌లం చంద్ర‌బాబుకే కాదు కేంద్రానికి ముకుతాడు వేసి పెట్టుబ‌డులు పిండే ప‌నిలో ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఏపీకి రూ.74,169 కోట్లు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వినతిపత్రం అందజేయనున్నారని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం శ్రీవారి దర్శనానికి ప్రధాని తిరుమలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ఇవ్వాలని ఆ వినతిపత్రం ద్వారా మోదీని కోరనున్నార‌ని స‌మాచారం. అలాగే ఆంధ్రాలోని 7 వెనుకబడిన జిల్లాలకు విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ ఇవ్వాలని.. ఇందుకు రూ.23,300 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని సీఎం జ‌గ‌న్ కోరనున్నారు.

ఏపీకి కేంద్ర ప్ర‌బుత్వం నుంచి రావాల్సిన నిధుల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.18,969 కోట్లు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయాలని జగన్‌ కోరనున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోని 10 నెలల రెవెన్యూలోటు రూ.16,078 కోట్లు కాగా కేంద్రం నుంచి ఇప్పటి వరకూ రూ.3979 కోట్లు వచ్చాయి. వేస్‌ అండ్‌ మీన్స్‌ సందిగ్ధత వల్ల రూ.6,870 కోట్ల ఖర్చును ఆ ఆర్థిక సంవత్సర రెవెన్యూలోటులో చూపలేకపోయారు. ఇవి రెండూ కలిపితే రెవెన్యూలోటు రూ.22,948 కోట్లకు చేరుకుంటుంది. 2014-15 ఆర్థిక సంవత్సర రెవెన్యూలోటులో రూ.16,078 కోట్లలో రూ.4,117 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందులో రూ.3979 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ.138.39 కోట్లు రావాల్సి ఉంది. వేజెస్‌ అండ్‌ మీన్స్‌ సందిగ్ధత వల్ల రెవెన్యూలోటులో చేర్చని రూ.6870 కోట్లలో పీఆర్సీ ఎరియర్స్‌ రూ.3,920 కోట్లు, బిల్లులు రూ.2,950 కోట్లు ఉన్నాయి. మొత్తం రెవెన్యూలోటు రూ.22,948 కోట్లలో ఇప్పటి వరకూ రూ.3979 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఇంకా రూ.18,969 కోట్లు రావాల్సి ఉంది. విభజన చట్టంలోని పన్నులకు సంబంధించిన సెక్షన్‌ 50, సెక్షన్‌ 51లను సవరిస్తే ఏపీకి అదనంగా రూ.3,820 కోట్లు వస్తాయని, ఈ సెక్షన్లను సవరించి ఏపీకి న్యాయం చేయాలని వినతిపత్రం ద్వారా జగన్‌ కోరనున్నారు. ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ.350 కోట్లు ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. గత ఐదేళ్లలో మూడేళ్లు ఈ నిధులు సక్రమంగానే ఇచ్చారు. నాలుగో ఏడాది రూ.350 కోట్లను ఏపీ ఖాతాలో వేసి వెనక్కి తీసుకున్నారు. ఐదో ఏడాది అసలు ఇవ్వలేదు. నాలుగో ఏడాది వెనక్కి తీసుకున్న నిధులను విడుదల చేయాలని నీతిఆయోగ్‌ కూడా కోరినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకూ ఆ నిధులు విడుదల చేయలేదు. వాటిని తక్షణమే విడుదల చేయాలని కోరనున్నారు.