హృతిక్ మాత్రమే ఆ పాత్ర చేయగలరు అనిపించింది : ఆనంద్ కుమార్

Tuesday, March 27th, 2018, 07:53:17 PM IST

గత కొద్దికాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న హృతిక్ రోషన్ కు ఇటీవల విడుదలయిన కాబిల్ సినిమా కొంత ఊరటనిచ్చినప్పటికీ పూర్తిస్థాయి తృప్తిని అయితే ఇవ్వలేదనే చెప్పాలి. అయితే తన తదుపరి చేస్తున్న సూపర్ 30 సినిమా పైన ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఓ గణిత ఉపాధ్యాయుడి నిజ జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది. బీహార్‌లోని ఆనంద్‌ కుమార్‌ అనే మ్యాథ్స్‌ టీచర్‌ తన విద్యార్థులకు ఐఐటీ దిశగా శిక్షణనిచ్చేవాడు. ఆయన విద్యార్థులందరూ ఐఐటీలోనే చదువుతున్నారు. అయితే అంతటి మేధావి ఆ స్థాయికి చేరుకున్న ప్రయాణాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాపై ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల క్రితం రచయిత సంజీవ్‌ దత్తా నా వద్దకు వచ్చారు. సూపర్‌ 30 పేరుతో మీ గురించి సినిమా తీయాలనుకుంటున్నాను అని చెప్పారు. హృతిక్‌ నా పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉంది. తనను నేను కలిసాను. పాత్రకోసం తను పడే కష్టాన్ని చూసి ఆయన మాత్రమే ఈ పాత్ర చేయగలరు అనిపించింది అన్నారు. నేను క్లాస్‌రూంలో చెప్పిన వీడియోలను చూస్తూ ఆయన నటిస్తున్నారు. హృతిక్‌ నా పాత్రను తన వంతు కృషితో చాలా బాగా చేస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆనంద్ కుమార్ ఆకాంక్షించారు. కాగా వచ్చే ఏడాది జనవరి 25న సూపర్‌30 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది….