వివాదం : `ఆస్కార్‌`ని వ‌దిలిపెట్ట‌ని కాపీ క్యాట్స్‌!?

Monday, January 29th, 2018, 10:53:55 PM IST

ఇటీవ‌లి కాలంలో కాపీ క్యాట్ వివాదాలు టాలీవుడ్ ప‌రువు న‌డిబ‌జారుకీడ్చాయి. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన `ఆజ్ఞాత‌వాసి` కాపీ సినిమా అంటూ పెద్ద ర‌చ్చ జ‌రిగింది. ఫ్రెంచి డైరెక్ట‌ర్ నేరుగా లీగ‌ల్ నోటీసులు పంపించేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డంతో గొడ‌వ మ‌రీ పెద్ద‌దైంది. ఇక దీంతో పాటు బాలీవుడ్‌లో ఆస్కార్ నామినేష‌న్ల‌కు వెళుతున్న న్యూట‌న్ సైతం ఇదే త‌ర‌హాలో వివాదంలో న‌లిగింది. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు కాపీ కొట్టి తీశాడ‌ని ప్ర‌చారం సాగింది. దీంతో ఆస్కార్ ల‌కు వెళ్లే సినిమా వేరొక సినిమాక కాపీనా? అంటూ మ‌న‌వాళ్లే తుది నామినేష‌న్‌కి పంప‌లేదు. ఆరంభ ద‌శ‌లోనే వెన‌క్కి వ‌చ్చింది ఆ చిత్రం. కాపీ రైట్స్ చ‌ట్టాలు బ‌లంగా ఉన్నందున ప్లాగ‌రిజ‌మ్ కుద‌ర‌డం లేదు ఇప్పుడు.

ఇక‌పోతే మార్చిలో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ ఉత్స‌వాల్లో పోటీప‌డేందుకు ప‌లు చిత్రాలు రెడీ అవుతున్నాయి. వీటిలో `షేప్ ఆఫ్ వాట‌ర్` చిత్రం అత్య‌ధిక నామినేష‌న్ల‌తో టాప్ లో ఉంది. అయితే ఈ సినిమా కూడా కాపీ క్యాట్ సినిమా అన్న ప్ర‌చారంతో ఒక్క‌సారిగా ఉలిక్కి పాటుకు గుర‌వ్వాల్సొచ్చింది. పులిట్జ‌ర్ విజేత అయిన ప్ర‌ముఖ స్టేజీ ప్లే రైట‌ర్ పాల్ జిందెల్ వార‌సుడు డేవిడ్ జిందెల్ ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా మేక‌ర్స్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. త‌న తండ్రి డైరెక్ట్ చేసిన ఓ ప్లేకి సంబంధించిన క‌థ ఇది. దానికి తెలివిగా కాపీ కొట్టేశారంటూ ప్ర‌ఖ్యాత గార్డియ‌న్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. “నాన్న గారి ప్లే `లెట్ మి హియ‌ర్ యు విస్ప‌ర్‌` క‌థాంశాన్ని తీసుకుని తెలివిగా సినిమాగా మార్చార‌ని ఆరోపించారాయ‌న‌. అయితే దీనిని షేప్ ఆఫ్ వాట‌ర్ ద‌ర్శ‌కుడు గుల్లెర్మో డెల్ టారో ఖండిస్తున్నారు. తాజా వివాదంతో `ది షేప్ ఆఫ్ వాట‌ర్` చిత్రానికి ఆస్కార్‌లు వ‌స్తాయా? రావా? అన్న చ‌ర్చ మొద‌లైంది.