విశాఖ లో దారుణం : ప్రేమికులిద్దరు ఒకేసారి ఆత్మహత్య…?

Wednesday, February 12th, 2020, 09:55:22 PM IST

మరో రెండు రోజుల్లో ప్రేమికుల రోజు రానున్న విషయం అందరికి తెలిసిందే. కానీ ఇలాంటి తరుణంలో విశాఖపట్నంలో ఒక దారుణమైన విషాదం నెలకొంది. ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు ప్రేమికులు ఫోన్ లో మాట్లాడుకుంటూ… వేరువేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా విశాఖపట్నం లోని గోపాలపట్నంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కాగా వివరాల్లోకి వెళ్తే… గోపాలపట్నం ప్రాంతానికి చెందిన మక్కా శిరీషా అనే యువతి గత కొంత కాలంగా, కంచరపాలెం ప్రాంతానికి చెందిన వెంకట్ అనే వ్యక్తి తో ప్రేమాయణం నడుపుతుంది. ఈక్రమంలో వారు తరచూ కలుస్తుండేవారు.

ఈ నేపథ్యంలో వారు బుధవారం నాడు సాయంత్రం వీరిద్దరూ ఫోనులో మాట్లాడుకునే క్రమంలో ఎదో విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో శిరీష తీవ్రమైన మనస్తాపానికి గురై ఇంటి మేడ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియురాలు చనిపోయిందని తెలిసి వెంకట్ కంచరపాలెంలో చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు మృతదేహాలని స్వాధీనం చేసుకొని కేజీహెచ్‌కు తరలించారు.