ట్రెండ్ సెట్ చేస్తున్న‌ `ప‌ద్మావ‌త్‌` జువెల‌రీ!?

Thursday, January 25th, 2018, 02:00:42 PM IST

ఎన్నో వివాదాల న‌డుమ ప‌ద్మావ‌త్ సినిమా రిలీజైంది. వివాదాల‌తో వ‌చ్చిన ప్ర‌చారంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే టాక్ కూడా పాజిటివ్‌గా వ‌చ్చింది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ ఓ దృశ్య‌కావ్యాన్ని ఆవిష్క‌రించాడ‌ని విజువ‌ల్ రిచ్ టెక్నిక‌ల్ వండ‌ర్‌ని చూపించాడ‌ని అంతా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ అయితే ఏకంగా 4.5/5 రేటింగుతో సినిమాని ఆకాశానికెత్తేశాడు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో మాష్ట‌ర్ పీస్ అంటూ పొగిడేశాడు. నిజంగానే సినిమాలో అంత మ్యాట‌ర్ ఉంద‌న్న‌ది స‌త్యం.

అదంతా అటుంచితే ఈ చిత్రంలో రాణీ ప‌ద్మిని కోసం ఉప‌యోగించిన వ‌జ్రాభ‌ర‌ణాలు మ‌హిళామ‌ణుల క‌న్ను కుట్టేలా ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు. ప‌ద్మావ‌త్ సినిమా గురించి ఎంత గొప్ప‌గా చెప్పుకుంటున్నారో, ఈ సినిమాలో ఉప‌యోగించిన కాస్ట్యూమ్స్‌- ఆభ‌ర‌ణాలు- మేక‌ప్ గురించి అంతే ముచ్చ‌టించుకుంటున్నారంతా. అయితే ఈ ఆభ‌ర‌ణాల సేక‌ర‌ణ కోసం భ‌న్సాలీ అండ్ టీమ్ నానా యాత‌న ప‌డింద‌న్న సంగ‌తిని ఇదిగో ఈవిడ చెబితే కానీ తెలియ‌డం లేదు. దాదాపు 500 కేజీల బంగారంను, వేలాది వజ్ర‌వైడూర్యాలు, కెంపులు, ర‌త్నాలు, ముత్యాలు వంటి వాటిని ఈ ఆభ‌ర‌ణాల కోసం ఉప‌యోగించారుట‌. కోటానుకోట్లు వెచ్చించి వీటిని కొన్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. అచ్చం రాజ్‌పుత్‌ల సంస్కృతిని ప్ర‌తిబింబించేలా కాస్ట్యూమ్స్‌, వాటి కాంబినేష‌న్ జువెల‌రీ కోసం ఏకంగా రాజ్థస్తాన్ కోట‌లు స‌హా రాజులు ఉన్న చోట‌ల్లా వెతికారు. చ‌రిత్ర‌ పుస్త‌కాలు, ఇత‌ర‌త్రా ఆధారాలు సేక‌రించారు. ప‌ద్మిని, రావ‌ల్ పాత్ర‌ల కోసం రాజ్‌పుత్ వార‌సుల్ని సంప్ర‌దిస్తే, కీల‌క‌మైన ఖిల్జీ గెట‌ప్ కోసం ఏకంగా ఆఫ్ఘ‌నిస్తాన్ వెళ్లి స‌మాచారం సేక‌రించారు. అక్క‌డ కోట‌ల ఆకృతుల‌పైనా ప‌రిశోధించారు. ఈ ఆస‌క్తి రేకెత్తించే వివ‌రాల్ని టైటాన్ కంపెనీ జువెల‌రీ విభాగం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రేవ‌తి కాంత్ ఓ వీడియో ద్వారా తెలిపారు.