ప‌ద్మావ‌తి : జ‌న‌వ‌రి 26 డేటే! ఫిబ్ర‌వ‌రి 9న‌ ప‌క్కా!?

Saturday, January 6th, 2018, 09:37:37 PM IST

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన వార్ ఎపిక్ డ్రామా `ప‌ద్మావ‌తి` రిలీజ‌వుతుందా? అవ్వ‌దా? ఇప్ప‌టికీ ఇదో ఫ‌జిల్‌లానే ఉంది. మొన్న‌నే సీబీఎఫ్‌సీ సెన్సార్ పూర్తి చేసి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. అయితే భారీగా ఈ సినిమాకి కోత పెట్టి, అటుపై టైటిల్‌ని `ప‌ద్మావ‌త్‌`గా మార్చుకోవాల్సిందిగా కండిష‌న్లు పెట్టింది. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా రిలీజ్‌కి ఇక మార్గం సుగ‌మం అయిన‌ట్టేన‌న్న చ‌ర్చ సాగింది. భ‌న్సాలీ ఇక రిలీజ్ తేదీని ఎంపిక చేసుకోవ‌డ‌మే ఆల‌స్య‌మ‌న్న ప్ర‌చారం సాగింది.

అయితే సెన్సార్ పూర్త‌యినా ఇంత‌వ‌ర‌కూ ఈ సినిమా రిలీజ్ తేదీ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై ప‌లు సందేహాలు ఊపందుకున్నాయి. వాస్త‌వానికి ఈ చిత్రానికి టైటిల్ మార్పు చేశారా? లేదా? అన్న‌ది తేలాల్సి ఉందింకా. ఆ విష‌యాన్ని చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. కేవ‌లం సెన్సార్ స‌ల‌హా మాత్ర‌మే ఇచ్చింది. ఇక ఈనెల 26న సినిమాని రిలీజ్ చేయాల‌ని భావించినా అదే రోజు రెండు భారీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. వాటిలో ఒక‌టి అక్ష‌య్ కుమార్ న‌టించిన `ప్యాడ్ మ్యాన్‌`, రెండోది సిద్ధార్థ్ మ‌ల్హోత్రా న‌టించిన `అయ్యారే` చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బ‌డ్జెట్ చిత్రాలు. వీటితో పోటీప‌డ‌డం వ‌ల్ల‌ ప‌ద్మావ‌తి క‌లెక్ష‌న్ల‌ను షేర్ చేసుకోవాల్సి వ‌స్తే ఆ మేర‌కు దెబ్బ ప‌డిన‌ట్టే. దానికంటే ఈ భారీ చిత్రాన్ని సోలోగా రిలీజ్ చేయ‌డ‌మే క‌రెక్ట‌ని భ‌న్సాలీ టీమ్ భావిస్తోందిట‌. ఆ మేర‌కు ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ చేస్తే బావుంటుంద‌ని యూనిట్ ప్లాన్ చేస్తోందిట‌. ఇక ఈ సినిమాకి 1540లో సూఫీ పోయెట్ మాలిక్ ముహ‌మ్మ‌ద్ జ‌యాసీ రాణీ `ప‌ద్మిని`పై ఆల‌పించిన గీతం నుంచి `ప‌ద్మావ‌త్‌` అనే ప‌దాన్ని టైటిల్‌గా నిర్ణ‌యించే ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. అయితే అస‌లు విష‌యం ఏంటి? అనేది చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించాకే అధికారికంగా ఓకే అయిన‌ట్టు.