వరి దిగుబడిలో తెలంగాణ టాప్.. సీఎం కేసీఆర్‌కి పల్లా కృతజ్ఞతలు..!

Thursday, May 28th, 2020, 03:00:34 AM IST

దేశంలోనే వరి దిగుబడిలో తెలంగాణ టాప్‌లో నిలిచింది. అయితే దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచిందని భారత ఆహార సంస్థ సిఎండి శ్రీ డివి ప్రసాద్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని అభినందించారు.

అయితే దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వంగా ఉందని, తాము సేకరించిన ధాన్యంలో తెలంగాణ నుంచి సేకరించిందే అత్యధిక భాగమని ఎఫ్.సి.ఐ. ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రైతులకు అభినందనలు తెలిపారు. సాగునీటి లభ్యతను, ఉచిత విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించుకున్న తెలంగాణ రైతులు తమ వృత్తి నైపుణ్యంతో పంటలు పండించారని అన్నారు. దీనిపై స్పందించిన రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం తీసుకున్న చర్యల ఫలితంగానే రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడులు పెరిగాయని, దేశానికి అవసరమైన ధాన్యంలో ఎక్కువ శాతం తెలంగాణ నుంచి వెళ్లడం వెనుక సీఎం దార్శనికత ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ని కలిసి పల్లా కృతజ్ఞతలు తెలిపారు.