కొండాకు ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి స‌వాల్‌!

Tuesday, June 11th, 2019, 08:15:13 PM IST

చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిపై తెరాస‌ మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి దొంగ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి తెరాస చేవెళ్ల ఎంపీగా వున్న ద‌గ్గ‌రి నుంచి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డికి త‌న‌కు మ‌ధ్య వ‌ర్గ పోరు తారా స్థాయికి చేరిన విష‌యం తెలిసిందే. త‌న‌కు ప్రాధాన్యం త‌గ్గించి ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డికి పార్టీలో, నియోజ‌క వ‌ర్గంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని చాలా సంద‌ర్భాల్లో కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి వాదించినా తెరాస అధినాయ‌క‌త్వం ప‌ట్టించుకోలేదు. దాంతో ఆగ్ర‌హించిన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ తెరాస‌కు గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.

ఆ త‌రువాత నుంచి కూడా ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, కొండాల మ‌ధ్య వ‌ర్గ పోరు అలాగే కొన‌సాగుతోంది. గ‌తంతో పోలిస్తే మ‌రీ ఎక్కువైంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ త‌న స్థానాన్ని ద‌క్కించుకుని ప‌ట్నంని ఓ ఆట ఆడుకోవాల‌ని కొండా విశ్వ‌ప్ర‌య‌త్నాలే చేశారు కానీ స‌క్సెస్ కాలేక చేవెళ్ల బ‌రిలో ఓట‌మి చ‌విచూశారు. తాండూరులో ఎమ్మెల్యేగా ఓడిన ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో మ‌ళ్లీ వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా కొండాపై ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. కొండా ఒక దొంగ అని, క‌బ్జా కోర‌ని, త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల్లో ఏదైనా నిరూపించాల‌ని స‌వాల్ విసిరారు. దీనిపై కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.