తాజా వార్త : ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ కు పవన్!!!

Tuesday, April 10th, 2018, 03:52:23 PM IST

మగధీర సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం తో మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. విడుదలయిన తొలి రోజునుండి మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటివరకు కలెక్షన్లపరంగా ఎదురులేకుండా దూసుకుపోతోంది. కేవలం సెలవు రోజుల్లోనే కాక, మామూలు రోజుల్లో కూడా 80 శాతం పైగా ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది. మరోవైపు ఓవర్సీస్ లో ఇప్పటికే అక్కడ నాన్ బాహుబలి రికార్డుగా వున్న శ్రీమంతుడు ని బీట్ చేసి సరికొత్త రికార్డు దిశగా పయనిస్తోంది.

అయితే ఈ సినిమాని నిన్న చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో వీక్షించారు. ఆయనకు ఈ సినిమా విపరీతంగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రేక్షకుల మధ్య చూసేందుకే వచ్చామని పవన్, చెర్రీ చెప్పారు. తొలిప్రేమ సినిమా తర్వాత తానెప్పుడూ బయటకు రాలేదని కానీ రంగస్థలం సినిమాను థియేటర్‌లో చూడాలనిపించిందని పవన్ తెలిపారు. రంగస్థలం చాలా అద్భుతమైన సినిమా అని, రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించాడని పవన్ కితాబిచ్చారు.

ఇది తన మనసుకు నచ్చిన సినిమా అని, మిగతా విషయాలు సక్సెస్ మీట్‌లో మాట్లాడుతానని పవన్ స్పష్టం చేశారు. దీంతో రంగస్థలం సక్సెస్‌మీట్‌కి పవన్ వస్తున్నారనే విషయం స్పష్టమయింది. అయితే పవన్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారని సమాచారం. ఒకే వేదికపై పవన్, చిరు, చెర్రీ కనిపిస్తే అది మెగా అభిమానులకు పెద్ద పండుగే అని చెప్పాలి…..