నా తుది శ్వాస వరకు జనసేన ఉంటుంది పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

Monday, June 10th, 2019, 09:18:10 AM IST

ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ గెలిచి అధికారాన్ని చేపట్టింది. జనసేన ఒక్క సీటుకే పరిమితమైనా వెనుకంజ వేసేది లేదని రాజకీయాలలో మక్కువతో ఇందులోకి రాలేదని సమాజంలో మార్పు తీసుకురావడం కోసం రాజకీయాలలోకి వచ్చానని గెలిచినా ఓడినా నా తుదిశ్వాస వరకు ప్రజలతోనే ఉంటానని పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పాడు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో గత మూడు రోజులుగా పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టినప్పుడే ఓటమి ఉంటుందని తెలుసుకున్నానని ఓటమి బాధతో నమ్ముకున్న జనాన్ని వదిలేసి వెళ్ళడం జన సైనికుడి లక్షణం కాదని నా తుది శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు.

అయితే రాజకీయాలలోకి పాతికేళ్ళ లక్ష్యంతో వచ్చానని ఎన్ని ఓడిదుడుకులు ఎదురైనా, ఎన్ని సార్లు ఓడించినా కింద పడిన లేచే అలల మాదిరిగా పైకి లేస్తామే తప్పా భయపడి పారిపోము అని ఆయన అన్నారు. జనసేనను భీమవరం, గాజువాకలో ఓడించడానికి 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని సార్లు ఓడించినా గెలిచే వరకు పోరాడుతాం అని, ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ కొడుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి సమస్య జనసేనతో చెప్పుకునేలా పనిచేయాలని, సమస్యల పరిష్కారానికి జనసేన ఉందనే నమ్మకం ప్రజల్లో కలగాలని చెప్పారు. 2014లో పార్టీ స్థాపన సమయంలో తన వెనుక పట్టుమని 10 మంది కూడా లేరని, నేడు మార్పు కోసం పోరాటానికి సిద్దమైన వేలాది మంది నాయకులు తనతో ఉన్నారని ఓటమిపాలైన కసి, పౌరషం జన సైనికులలో ఉండాలని నేడు ఓటమిపాలైనా, విజయం వరించే వరకు పోరాడాలని ఖచ్చితంగా జనసేన జెండా ఎగరవేస్తానని అందుకే వచ్చానని మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలలో, జన సైనికులలో ఆత్మ విశ్వాసాన్ని నింపాడు.