పవన్ కారణంగా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు మొదలైంది

Wednesday, September 18th, 2019, 11:23:37 AM IST

నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్నామధ్యన హైదరాబాద్లోని ఓ హోటల్లో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హెచ్, రెవంత్ రెడ్డిలు హాజరై ప్రముఖంగా మాట్లాడారు. సమావేశం బాగానే హిట్టైంది. నల్లమలను కాపాడటం కోసం అన్ని రాజకీయ పార్టీలను ఒక్కటి చేస్తున్నాడనే పేరు పవన్ కళ్యాణ్ కు వచ్చింది.

కొందరైతే జరిగిన మంచిని పక్కనబెట్టి అసలు అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ పవన్ దిశా నిర్దేశంలో నడవడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. పవన్ పిలవగానే సమావేశానికి వెళ్లిన నేతలపై నిప్పులు చెరుగుతున్నారు ఇతర కాంగ్రెస్ నేతలు. అసలు 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ప్రతినిధులుగా వెళ్ళడం ఏమిటి, అనవసరంగా మన బలంతో పవన్ ను హీరోను చేస్తున్నారని మండిపడ్డారు.

అసలే పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ నెలకొని ఉండటంతో ఈ వ్యవహారాన్ని ఎత్తి చూపుతూ విమర్శలు కురుస్తున్నాయి. మొత్తానికి పవన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రాజేశారనే అనుకోవాలి.