పవన్ డిసీషన్: జనసేన ప్రధాన కార్యదర్శిగా మరో కీలకనేతకు బాధ్యతలు..!

Monday, November 11th, 2019, 11:34:50 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో జనసేన ఓడిపోయినా తాను పూర్తిగా రాజకీయాలలోనే ఉంటానని, ఖచ్చితంగా జనసేనను అధికారంలోకి తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ ఇదివరకే చెప్పారు.

అయితే ప్రస్తుతం ఏపీలో ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ప్రభుత్వానికి తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. అయితే ఈ ఓటమిని పక్కన పెట్టి వచ్చే ఎన్నికల కోసం పార్టీనీ బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టారు. అందుకు తగ్గ ప్రణాళికలు వేసుకుని పక్కాగా ముందుకెళ్తున్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా తమ్మిరెడ్డి శివశంకర్‌ను నియమిస్తూ ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. గతంలో గ్రూప్ 1 ఆఫీసర్ అయిన శివశంకర్ 2018లో ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అయితే ప్రస్తుతమున్న తోట చంద్రశేఖర్ తర్వాత మరో ప్రధాన కార్యదర్శిగా శివశంకర్ కొనసాగనున్నారు.