ఎమ్మెల్యే రాపాక స్టోరీపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Tuesday, January 14th, 2020, 09:20:39 PM IST

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో జనసేన తరుపున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అయితే గత కొద్ది రోజుల నుంచి రాపాక పార్టీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టారు. ఇదే క్రమంలో జనసేన కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు, వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. అయితే పవన్‌పై ద్వారంపూడి అసభ్యకర వ్యాఖ్యలు చేసినా, జనసేన కార్యకర్తలపై దాడులు చేసిన కనీసం రాపాక స్పందించకపోగా గుడివాడలో మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందేలకు వెళ్ళాడు. అయితే రాపాక వ్యవహారశైలిపై జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర కోపంగా ఉన్నారు. అయితే నేడు కాకినాడలో పర్యటించిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన పవన్‌ని జర్నలిస్ట్‌లు రాపాక వ్యవహార శైలి గురుంచి అడిగారు. అయితే దానికి పవన్ పాపం ఆయనకు ఎలాంటి ఒతిళ్ళు ఉన్నాయో చెప్పలేం కదా అంటూ ఒక్క మాటతో సమాధానమిచ్చారు.