ఇలాగే అన్నీ రహస్యంగా ఉంచితే ఇంకాస్త డ్యామేజ్ తప్పదు పవన్

Sunday, July 7th, 2019, 01:44:45 PM IST

గత ఎన్నికల్లో జనసేన ఊహించని పరాభవాన్ని చూడటానికి గల ప్రధాన కారణాల్లో పార్టీలో అంతర్గతంగా నడుస్తున్న వ్యవహారాల పట్ల జనానికి క్లారిటీ ఇవ్వకపోవడమే. కీలకమైన పొత్తుల విషయంలో పవన్ ఓటర్లకు సరైన అవగాహన కల్పించలేదు. దీంతో వైకాపా వర్గాలు జనసేన, టీడీపీ ఒకటేనని ఆరోపణలు చేయగా, టీడీపీ మూసి మూసి నవ్వులు నవ్వుతూనే ఎప్పటికైనా పవన్ మావాడే అన్నట్టు ప్రవర్తించాయి. దీంతో పవన్ ఎవరితోనూ పొత్తులు లేవని రెండు మూడు సార్లు చెప్పిన మాటల్ని జనం నమ్మలేదు.

స్వయానా మొదట్లో జనసేనను నమ్మిన వాళ్ళే జనసేనకు ఓటేస్తే అది టీడీపీ ఖాతాలోకే వెళుతుంది అని వైకాపాకు ఓట్లను సమర్పించుకున్నారు. దీంతో భారీగా జనసేన ఓట్ షేర్ పడిపోయింది. జరిగిన పొరపాటు ఎలాగూ జరిగిపోయింది.. దాన్ని ఇప్పుడైనా సరిదిద్దుకుని పార్టీ నడవడిక ఏమిటో జనానికి స్పష్టంగా తెలిసేలా చేయాలి. కానీ పవన్ మాత్రం తానా సభల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ భాజాపా కీలక నేత రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారు. ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

భవిష్యత్తులో పవన్ భాజాపాతో కలిసి అడుగులు వేస్తారనే ప్రచారం మొదలైంది. ఇక ఏపీలో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తున్నా భాజాపా వర్గాలు సైతం నెమ్మదిగా పవన్ తమవైపుకు వస్తారనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి. పవన్ ఇకనైనా మౌనం తగ్గించి వీటికి వెంటనే చెక్ పెట్టకపోతే జనసేనకు ఇంకాస్త డ్యామేజ్ జరగడం ఖాయం.