పవన్.. ఈసారైనా ముందే చెప్తే మంచిది

Monday, June 10th, 2019, 01:01:33 PM IST

ఓటమికి కారణాల వెతుక్కుంటూ పవన్ సమీక్ష సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. ఓటమి ఆయనలోని ఆవేశాన్ని ఏమాత్రం తగ్గించలేదని ఈ సమావేశాల్లో ఆయన మాటల ద్వారా తేలింది. ఓడిపోయే కొద్ది రాటుదేలుతానని, ఇప్పటి వరకకూ నా ఆశయాలు చూశారు, ఇకపై నా రాజకీయం చూస్తారు అంటూ పవన్ మాట్లాడిన మాటలు వింటే జనసేన మరింత చురుగ్గా మారనుందని అర్థమవుతోంది. కానీ పవన్ గతంలో చేసిన తప్పుల్ని ఈసారి పునరావృతం చేయకుండా ఉంటే మంచిదని అభిమానులు(జనసేనకు ఓటు వేసిన ఓటర్లు) భావిస్తున్నారు.

గత ఎన్నికలకు మూడు నెలల ముందే కార్యకలాపాల్ని వేగవంతం చేసిన పవన్ ప్రతి నిర్ణయాన్ని ఆఖరి నిముషంలోనే తీసుకునేవారు. తద్వారా అభిమానులకు, కార్యకర్తలకు జనాన్ని పార్టీ కార్యకలాపాల్లో భాస్వామ్యం చేసే వీలు అస్సలు దొరకలేదు. ప్రతి సమావేశానికి, కార్యక్రమానికి పార్టీ వ్యక్తులే తప్ప సామాన్య జనం, మహిళలు హాజరుకాలేకపోయారు. అసలు ఓటర్లను పార్టీ వైపుకు తిప్పడానికి కార్యకర్తలకు సమయం లేకుండా పోయింది. ఇదంతా పవన్ ఇన్స్టంట్ డెసిషన్స్ మూలానే జరిగింది.

కాబట్టి సేనాని ఇకనైనా భవిష్యత్ కార్యచరణను ముందుగానే పార్టీ వర్గాలకు చెప్పి సన్నద్ధమవడానికి, ప్రజల్ని వాటిలో భాగస్వామ్యం చేయడానికి సమయం ఇస్తే గతం కంటే ఈసారి పార్టీ జనంలోకి వెళ్లి, టీడీపీ ఘోర ఓటమితో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించే వీలుంటుంది.