విచిత్ర సంప్రదాయం- శవపేటికల్లో పడుకొని 2019 కి ఆహ్వానం

Tuesday, January 1st, 2019, 07:04:36 PM IST

ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంప్రదాయాలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని బాగానే ఉన్నప్పటికీ, మరి కొన్ని మాత్రం చాలా విచిత్రం గా ఉంటాయి. ఇలాంటి వింత ఆచారం థాయిలాండ్ లో జరిగింది. నూతన సంవత్సర వేడుకల కోసం ప్రపంచమంతా బాణా సంచా వెలుగులు, విందు వినోదాల్లో మునిగి తేలుతుంటే థాయ్‌లాండ్‌లో మాత్రం చాలా మంది వింతగా శవపేటికల్లో పడుకొని కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. కానీ ఇది అక్కడి సంప్రదాయమట. వాళ్ళ ఆచారంలో భాగంగా అక్కడ కొంత మంది శవపేటికల్లో తమ చేతిలో పుష్పగుచ్ఛాలు పట్టుకొని పడుకున్నారు.

వాళ్ళు పడుకున్న శవ పేటికలపైనా బౌద్ధ సన్యాసులు వస్త్రాన్ని కప్పి చనిపోయిన వారి దగ్గర చదివే మంత్రాలను చదివి అనంతరం ఆ వస్త్రాన్ని తొలగించారు. తరువాత భక్తులు బయటకు వస్తారు. అక్కడి భక్తులు దీన్ని చావు, తిరిగి పుట్టడానికి సూచికగా భావిస్తారు. వాళ్ల దురదృష్టాలు, బాధలను శవపేటికలో వదిలేసి మళ్లీ పుట్టినట్లు కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తామని నమ్ముతారు. అందుకే అలా శవపేటికల్లో పడుకుంటారు. ‘శవపేటికల్లో పడుకోవడం అంటే.. శరీరానికి, మనసుకు సంబంధించిన అన్ని బాధలను వదిలేయడం. తర్వాత కొత్త అదృష్టం వరిస్తుంది, కొత్త జీవితం ప్రారంభిస్తాము’ అని శవపేటికలో పడుకోవడానికి సిద్ధమైన ఓ భక్తుడు తెలిపారు.