శశికళ పరిస్థితి రెండు రోజుల్లో ఇలా అయిపోయింది ఏంటి..?

Tuesday, December 27th, 2016, 12:04:35 PM IST

sasikala
అసలు తమిళనాడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడంలేదు. జయలలిత మరణం తరువాత తమిళనాడు రాజకీయాలు ఊసరవెల్లిలా రోజుకో రంగు మారుతున్నాయి. అన్నాడీఎంకే నేతలు రెండు వర్గాలుగా విడిపోయి మరీ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఒక వర్గం వారు శశికళని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తుండగా ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం వారు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు ప్రజలు కూడా అసలు తమ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు.

జయలలితకు సన్నిహితురాలైన శశికళని 11 మంది వైస్ ఛాన్సలర్లు భేటీ కావడంపై ఉన్నత విద్య శాఖను వివరణ అడుగుతూ గవర్నర్ కార్యాలయం లేఖ రాసింది. ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా ఏ పదవిలోనూ లేని శశికళను వైస్ ఛాన్సలర్లు కలవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్, మిగిలిన ప్రతిపక్ష నాయకులందరూ శశికళను కలుసుకున్న వైస్ ఛాన్సలర్లను అందరినీ డిస్మిస్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్టాలిన్ గవర్నర్ కు ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ కూడా రాశారు. ఈ విషయంపై రాష్ట్ర గవర్నర్ తగు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ కోరారు.

ఇదిలా ఉంటే తమిళనాడులో తాజాగా జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే నిన్నటి వరకు చిన్నమ్మ..చిన్నమ్మ అంటూ శశికళ చుట్టూ తిరిగిన వారే ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది. నిన్నటి వరకు ఆమెకు అనుకూలంగా ఉన్న పరిస్థితులన్నీ ఇప్పుడు ప్రతికూలంగా మారుతున్నాయన్న అనుమానం వస్తుంది. గత రెండు రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీ పగ్గాలు ఆమెకు దక్కకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి.

ఇంకోవైపు అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం ”పోయెస్ గార్డెన్” కు ఉన్న హై సెక్యూరిటీని సోమవారం ఉపసంహరించారు. జయలలిత మరణం తరువాత కూడా పోలీస్ ఉన్నతాధికారులతో కలిపి 240 మంది ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉన్నారు. ఈ విషయంపై స్టాలిన్ మాట్లాడుతూ.. జయలలిత నివాసంలో ప్రస్తుతం రాజకీయనాయకులు గానీ, జెడ్ కేటగిరి భద్రత కలిగిన వాళ్ళు లేని పరిస్థితుల్లో ఇంకా అక్కడ అంతమంది సెక్యూరిటీ అధికారులు ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. స్టాలిన్ కు మిగిలిన ప్రతిపక్షాలు వత్తాసు పలికాయి. దీంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. జయలలిత నివాసం వద్ద 25 ఏళ్ల పాటు కొనసాగించిన హై సెక్యూరిటీని తొలగించారు. ప్రస్తుతం ఇప్పుడు నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే సెక్యూరిటీ విధుల్లో పాల్గొంటున్నారు. సఫారీ ధరించిన మరొక 15 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది నివాసం చుట్టూ 5 చోట్ల తలా ముగ్గురు చొప్పున కాపలా కాస్తున్నారు. వైస్ ఛాన్సలర్లు శశికళను కలిసిన విషయంపై గవర్నర్ వివరణ కోరడం, పోయెస్ గార్డెన్ సెక్యూరిటీని తొలగించడం వంటి సంఘటనలు శశికళకు ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయని చెప్పొచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments