తరగతుల పేరుతో జగన్ ఇచ్చిన శిక్షణ ఇదేనా

Friday, July 12th, 2019, 02:01:36 PM IST

అసెంబ్లీ సమావేశాలు ఇంకొన్ని రోజుల్లో జరుగుతాయనగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులను నిర్వహించారు. సభలో ఎవరెవరు ఏయే అంశాలను ప్రస్తావనకు తేవాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలపై సూచనలు చేశారు. సభను హుందాగా నడపడం కోసం విలువైన సభా సమయాన్ని సమస్యల పరిష్కారానికి వాడటం కోసమే ఈ శిక్షణా తరగతులని వైకాపా నేతలు గొప్పగా చెప్పుకున్నారు. జనం సైతం ఈసారి సభా సమావేశాలు గొప్పగా ఉంటాయని ఆశపడ్డారు.

కానీ నిన్నటి సభ మొదలైన కాసేపటికే ఇవి కూడా అన్ని సభల మాదిరిగానే ఉండబోతున్నాయని అర్థమైపోయింది. అధికార పక్షం ప్రతిపక్షాన్ని అన్ని విధాలా నవ్వులపాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. స్వయంగా సిఎంగారే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును గాడిదలు కాస్తున్నారా అని సంభోదించడం, ఆయన మాట్లాడుటున్నంత సేపు ఎగతాళిగా నవ్వడం, వెనక నుండి సెటైర్లు వేయడం చేశారు. ఇక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కోసం తపించే అనిల్ కుమార్ యాదవ్ అయితే అవసరంలేని ఆవేశంతో దొబ్బెయ్ అంటూ నోరుజారారు.

ఇది చూసిన జనమంతా మొదటిరోజే సభ ఇలా ఉంటే పోను పోను ఇంకెలా తయారవుతుందో, ఇదేనా ఎమ్మెల్యేలకు ఇచ్చిన శిక్షణ, గతానికి ఇప్పటికి పెద్ద తేడా ఏమీ లేదే అనుకుంటున్నారు.