కాపాడుకోలేక రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు !

Sunday, June 9th, 2019, 03:30:39 PM IST

పదవుల్లో ఉన్న నేతలు పార్టీలు మారడం దేశవ్యాప్తంగా నడుస్తున్న ఆనవాయితీ. దీనికి ఈ రాష్ట్రమూ, ఏ పార్టీ అతీతం కాదు. గతంలో పక్క పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను నవ్వుతూ తమలోకి చేర్చుకున్న పార్టీలే ఇప్పుడు తమ ఎమ్మెల్యేలే పార్టీని వీడి వేరే పార్టీల్లోకి పోతుంటే లబోదిబోమంటున్నాయి. వాటిలో ప్రధానమైనది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. గతంలో అనేకమార్లు పదవుల్లో ఉన్న ఇతర పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలను సాదరంగా ఆహ్వానించి కలిస్ వస్తామంటే ఆహ్వానించాం అని నీతులు పలికిన అదే కాంగ్రెస్ ఇప్పుడు అదే పద్దతిని తెరాస అవలంబిస్తుంటే గగ్గోలు పెడుతోంది.

తాజాగా కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తెరాసఎల్పీలో విలీనం చేయడంతో భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. మాజీ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సత్యాగ్రహ దీక్షను చేపట్టి దాన్ని ఆమర నిరాహార దీక్షగా మార్చారు. రాజ్యాంగం పట్టపగలే అపహాస్యానికి గురైందని ఆగ్రహించారు. ఆయన మాటల్లో న్యాయం ఉన్నా, తెరాస చేసింది నైతికంగా సరైనది కాకున్నా కాంగ్రెస్ ఒకప్పుడు చేసిన పని ఇదే. ఆనాడు తాము చేసిన పని ఈనాడు ఇతరుల చేస్తే తప్పేలా అవుతోందో హస్తం నేతలు వివరించలేకపోతున్నారు. అందుకే జనం సైతం ఎమ్మెల్యేలు తమకి తాముగా పార్టీలు మారితే ఎవరేం చేస్తారు. బుద్ది మారిన వాళ్లకు ఉండాలి. అయినా సొంత పార్టీలోని ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఇలా రోడ్డెక్కితే ఏం లాభం అంటున్నారు.