లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి.. జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ..!

Wednesday, April 21st, 2021, 03:00:56 AM IST

modi_package

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన నిర్ణయాలపై నేడు సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ కొద్ది సేపటి క్రితం జాతినుద్దేశించి మాట్లాడారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి కొన్నాళ్లుగా క‌ఠిన‌మైన పోరాటం చేస్తున్నామని, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ దేశంలో ఉదృత్తంగా విస్తరిస్తుందని మనమందరం కలిసి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. ప్రజలు అప్రమత్తం కావాలని, ధైర్యం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లు అందరూ ఈ సంక్షోభ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆక్సిజన్ కొరతమీద కూడా స్పందించిన మోదీ దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత ఉందని అయితే ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని, సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి కోసం అనేక ప్లాంట్లు నెలకొల్పామని అవసరమైన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌పై కూడా ప్రధాని మోదీ స్పష్టతనిచ్చారు. దేశంలో ఇప్పుడు లాక్‌డౌన్ విధించాల్సిన ప‌రిస్థితులు లేవ‌ని, కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలను విధిస్తున్నాయని క‌రోనాను నియంత్రించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను చివ‌రి అస్త్రంగానే భావించాలి అని సూచించారు. లాక్‌డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలని అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు త‌ప్పితే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావద్దని విజ్ణప్తి చేశారు. దేశంలోని యువత తమ పరిసరాల్లో చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి కోవిడ్‌పై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కరోనా మొదటి విడుత సమయంలో దేశంలోని శాస్త్రవేత్తలు రాత్రి, పగలు కష్టపడి వ్యాక్సిన్లను తయారు చేశారని, ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా టీకాలు వేస్తున్న దేశంగా భారత్ నిలిచిందని, దేశంలో వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోందని మోదీ అన్నారు. మే 1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించామని అన్నారు.