ఇకపై వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే.. ప్రధాని మోదీ కీలక నిర్ణయం..!

Monday, June 7th, 2021, 10:37:50 PM IST

కరోనా వ్యాక్సినేషన్ పంపిణీపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలందరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించే బాధ్యత కేంద్రానిదే అని, ఇకపై వ్యాక్సినేషన్ పంపిణీ పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని తెలిపారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికి ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని, జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని తెలిపారు. 75 శాతం వ్యాక్సిన్ డోసులను కేంద్రమే రాష్ట్రాలకు అందిస్తుందని, ఏ రాష్ట్రం కూడా వ్యాక్సిన్ల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మోదీ అన్నారు.

అయితే వ్యాక్సిన్ ఉత్పత్తిపై కూడా మాట్లాడిన మోదీ తక్కువ సమయంలో వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు సఫలమయ్యారని, ప్రస్తుతం దేశంలో ఏడు కంపెనీలు వివిధ దశల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు కంపెనీల వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ప్రజలకు 23కోట్ల కోవిడ్ డోసులిచ్చామని, వ్యాక్సినేషన్‌లో మనం ఎవరికంటే వెనకబడి లేమని స్పష్టం చేశారు. చిన్నారుల వ్యాక్సిన్ కోసం ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

ఇకపోతే దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి 10 రెట్లకు మించి పెంచామని, ఇంత మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఎప్పుడూ రాలేదని అన్నారు. ఆర్మీ నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వేలను ఉపయోగించి ఆక్సిజన్ కొరతను తీర్చామన్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని ఈ ఏడాది దీపావళి(నవంబర్) వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో దేశంలోని 80 కోట్ల మంది పేదలు ఉచితంగా రేషన్ పొందవచ్చన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలెవరూ ఆకలితో ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.