ఇది కర్ఫ్యూ టైమ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు..!

Friday, May 22nd, 2020, 01:00:58 AM IST

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న అడవి బిడ్డలకు గత కొద్ది రోజులుగా తన వంతు సాయంగా ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వారందరికి అడవులలో నడుచుకుంటూ వెళ్ళి మరీ నిత్యవసర సరుకులు, ఆహారాన్ని పంపిణీ చేస్తుండడంతో చాలా మంది ఎమ్మెల్యే సీతక్కపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

అయితే తాజాగా గిరిజనులకు సరుకులు పంపిణీ చేసేందుకు వెళ్తుండగా ఆసిఫాబాద్ జిల్లా నవేగాంలో కర్ఫ్యూ సమయంలో ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సరుకులను స్థానిక నేతలకు అప్పగించి సీతక్క అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. నిరుపేద గిరిజన నిర్వాసితుల వద్దకు వెళుతుంటే తనను అడ్డుకోవడం దారుణమని పోలీసుల తీరుపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.