టీఆర్ఎస్ ఫిర్యాదు.. ఉత్తమ్ పై కేసు నమోదు..!

Sunday, October 20th, 2019, 10:25:09 PM IST

హుజూర్‌నగర్‌లో రేపు ఉప ఎన్నిక జరగనున్న సందర్భంగా గత కొద్ది రోజుల నుంచి నాయకులు ఎడతెరిపి లేకుండా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం జరపగా, నిన్నటి సాయంత్రానికి అన్ని పార్టీల ప్రచారానికి గడువు ముగిసింది. అయితే ప్రచార సమయం ముగిసిన తరువాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఓటర్లను ప్రలోభానికి గురిచేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంగించారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు.

అంతేకాదు టీఆర్ఎస్ నేతలు అందించిన ఫిర్యాదులో హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయటకు పంపించాలని కోరింది. అయితే వారి ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఆరోపణలు నిజమేనని తేలడంతో టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హుజూర్‌నగర్‌లో రేపు ఉప ఎన్నిక జరగనుండగా ఈ నెల 24న ఫలితాలు వెల్లడవుతాయి.