వివాదంలో రంగమ్మ…పాట తీసేస్తున్నారా..?

Thursday, March 15th, 2018, 12:27:58 PM IST

చాల రోజులు గా రిలీజ్ చేస్తాం అనుకున్న ప్రతీ సారీ రంగస్థలం సినిమాకి ఏదో ఒక చిక్కుల్లో పడుతూనే వస్తుంది. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం రంగ‌స్థ‌లం మార్చి 30న విడుద‌ల కావడానికి సిద్దం కాగా, చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తుంది. రీసెంట్‌గా దేవి శ్రీ స‌మ‌కూర్చిన బాణీల‌న్నింటిని విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ఇవి సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. 1985 కాలం నాటి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇటు మాస్‌, అటు క్లాస్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించనుంద‌ని టీం చెబుతుంది. ఎన్నో ఎక్స్‌పెక్టేష‌న్స్ మ‌ధ్య విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని ప్ర‌స్తుతం ప‌లు వివాదాలు చుట్టు ముట్టాయ‌ని తెలుస్తుంది. ముంబై భామ మాన‌సి పాడిన‌ ‘రంగమ్మ మంగమ్మ… సాంగ్‌లో గొల్లభామ వచ్చి నాగోరు గిచ్చుతుంటే’ అంటూ సాగిన చరణం యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉందని, వెంటనే దాన్ని తొలగించాల’ ని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. యాదవుల పట్ల దర్శకుడు, నిర్మాత, రచయితల‌ వైఖరి సరికాదన్నారు. పాటలోని ఆ చరణాన్ని వెంట‌నే తొలగించాలని, లేదంటే సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ని అడ్డుకుంటామ‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటుందో చూడాలి. ‘రంగమ్మ మంగమ్మ… సాంగ్‌కి చంద్ర‌బోస్ లిరిక్స్ అందించ‌గా, ఈ సాంగ్ త‌క్కువ టైంలో హ్యూజ్ రెస్పాన్స్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.