పోలీసుల తొందరపాటు.. ఎవరో తెలుసుకోకుండా లాఠీ ఛార్జ్..!

Wednesday, March 25th, 2020, 10:00:49 PM IST


కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించారు. ఇటు తెలంగాణలో కూడా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే లాఠీ దెబ్బ రుచి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు.

అయితే కొన్ని చోట్ల మాత్రం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తి ఎవరనే విషయాన్ని తెలుసుకోకుండా, ఎందుకు వెలుతున్నారు అనే దాని గురుంచి అడగకుండా టోలీచౌకీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక వ్యక్తిపై లాఠీ ఛార్జ్ చేయడం ఇప్పుడు పోలీసుల తీరుపై మరింత విమర్శలకు దారితీసింది. మానవ హక్కుల వేదిక ఉపాధ్యక్షుడైన సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి ప్రతీ రోజు మెటర్నిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా భోజనం అందిస్తాడు. అయితే నేడు ఎవరో దాత నుంచి డబ్బులు తీసుకొనేందుకు సయ్యద్ బిలాల్ వెళ్తుండగా టోలీచౌకీ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన చెప్పేది వినిపించుకోకుండా విపరీతంగా కొట్టారు. అయితే దీనిపై మానవ హక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కనీసం దేనికోసం బయటికివచ్చారో తెలుసుకోకుండా సయ్యద్ బిలాల్ పై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.