తెలంగాణ దొర పిట్టలదొరట!

Tuesday, September 9th, 2014, 11:21:31 AM IST


తెలంగాణ పిసిసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అభద్రతకు గురవుతున్నారని అందుకే కరువు బారిన పడిన రైతులను పరామర్శించటం లేదని ధ్వజమెత్తారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును పరామర్శించే తీరిక ఉందికాని విద్యుత్, కరువు, వరదలతో ప్రజలు సతమతమవుతుంటే పట్టించుకునే సమయం మాత్రం కెసిఆర్ కు లేదని పొన్నాల ఎద్దేవా చేసారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ కెసిఆర్ ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పధకాలపైనే శ్రద్ధ చూపుతున్నారని, రుణమాఫీపై అయోమయంలో ఉండి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే కెసిఆర్ మాటకారి, మోసకారి, బుడబుక్కల, పిట్టలదొరని పొన్నాల తీవ్రంగా విమర్శించారు. ఇక కెసిఆర్ వంద రోజుల పాలనపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేసారు. అలాగే తెలంగాణ ఇస్తే సోనియాకు రుణపడి ఉంటానన్న కెసిఆర్ ఆ తర్వాత మాట మార్చారని పొన్నాల మండిపడ్డారు. ఇక కెసిఆర్ కు సింగపూర్ వెళ్ళడానికి సమయం ఉందికాని ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి తీరిక లేదని పొన్నాల లక్ష్మయ్య ఉగ్రరూపం దాల్చారు.