కెసిఆర్ గుండెల్లో నిద్రపోతారట!

Friday, October 17th, 2014, 05:11:12 PM IST

ponnala-and-kcr
తెలంగాణ పిసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కరీంనగర్ రైతు భరోసా యాత్రలో శుక్రవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నిమిషాలలోనే ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ అంశాలపై సంతకం చేశారని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం అధికారంలోకి వచ్చిన ఆరు వారాల తర్వాత రుణమాఫీపై ఉపసంఘాన్ని నియమించారని ఎద్దేవా చేశారు. అలాగే రైతుల ఆత్మహత్యలు కెసిఆర్ చేసిన మోసానికి నిదర్శనమని పొన్నాల ధ్వజమెత్తారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు తెరాస వైఫల్యమే కారణమని మరోసారి ఉద్ఘాటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణలో కెసిఆర్ అధికారంలోకి వచ్చాకే రైతులకు కష్టాలు మొదలయ్యాయని పొన్నాల విమర్శించారు. ఇక తాము రైతులకు భారోశా ఇచ్చి ఆందోళన చేపట్టామని, ఇది ఆరంభం మాత్రమేనని, విద్యుత్ సమస్యను అరికట్టి రైతుల ఆత్మహత్యలు నివారించేవరకు కాంగ్రెస్ కార్యకర్తలు కెసిఆర్ గుండెల్లో నిద్రపోతారని పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు.