కేటీఆర్‌కి దిమ్మతిరిగే ప్రశ్న వేసిన పొన్నం ప్రభాకర్.. నో రెస్పాన్స్..!

Wednesday, October 9th, 2019, 08:44:12 PM IST

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి చిన్న చిన్న విషయాలపై ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే కల్వకుంట్ల ట్విటర్ రావుగా బాగా ప్రచారంలోకి వచ్చారని, ఆ ట్విట్టర్ పిట్టకు ఇంత పెద్ద సమస్య కనిపించడం లేదా అని ఎద్దేవా చేసారు.

అయితే ఎన్నికల ముందు కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని హామీ ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. సమ్మెపై వారు ముందుగానే ప్రభుత్వానికి నోటీసులు అందించారని వారికి కావలసిన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చమని అడిగితే వారి ఉద్యోగాలు తొలగించి, వారి కుటుంబాలు రోడ్డున పడేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాస్త కల్వకుంట్ల కోతలరావుగా మిగిలిపోతారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కేటీఆర్ వెంటనే స్పందించాలని లేదంటే తెలంగాణ ప్రజల ముందు ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. అంతేకాదు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, వారి డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే దాకా వారి తరుపున పోరాడుతుందని అన్నారు. అయితే ఇన్ని రోజులు ఈ విషయంపై సైలెంట్‌గా ఉన్న కేటీఆర్ ఇకనైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి మరీ.