అమ్మో అది నావల్ల అసలే కాదు :పూజ హెగ్డే

Thursday, April 19th, 2018, 09:04:43 AM IST

తారలు తరచుగా చెప్పే ఓ మాట ‘తాము రొటీన్‌ కథలకి దూరం’ అని. జిగేల్‌ రాణి పూజా హెగ్డే ఆ మాట చెప్పడమే కాదు, ఆచరణలో కూడా పెడుతూ ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల్ని ఎంచుకొంటోంది. కెరీర్‌ పరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా నా తీరు అదే అంటోందామె. ‘‘చాలామంది ప్రణాళికలు వేసుకొని ప్రతి రోజునీ ఒక క్రమ పద్ధతిలో గడుపుతుంటారు. ఎందుకో అది కూడా నచ్చదు నాకు. గడిపే రోజైనా, చేసే పనైనా ప్రతి క్షణం కొత్తగా అనిపించాలి.

అందుకే ఖాళీ దొరికిందంటే ఆ క్షణంలో నాకు ఏ పని చేయాలనిపిస్తే అదే చేస్తుంటా. ఒక వేళ నేను నటిని కాకపోయినా, ఒక వృత్తికో, పనికో పరిమితమయ్యేదాన్ని కాదు. ఒకే పనిని, ఒకే పద్ధతిలో చేస్తూ వెళ్లడం నావల్ల అస్సలు కాని విషయం. సెట్లో రోజూ ఓ కొత్త సన్నివేశం చేస్తూ, కొత్త అనుభవాల్ని సంపాదిస్తుంటే ఆ కిక్కే వేరు’’ అని సెలవిచ్చింది పూజా. ఆమె వరుసగా ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌లతో కలిసి నటించబోతోంది.

  •  
  •  
  •  
  •  

Comments