పోస్టాఫీస్‌లో ఎంప్లాయ్‌మెంట్‌ రిజిస్ట్రేషన్ !

Monday, February 13th, 2017, 06:49:31 PM IST


గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత.. ఉద్యోగాల కోసం వెతుకులాట‌ల‌తోనే ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచిపోతుంది. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కి వెళ్లి ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేష‌న్ ఆఫీస్‌లో స‌ర్టిఫికెట్ట‌ను జ‌త‌చేసి రిజిష్ట‌ర్ అవ్వాల్సి ఉంటుంది. అలా రిజిష్ట‌ర్ అయినా ఏనాడూ కాల్ లెట‌ర్ అన్న‌దే వ‌చ్చేది లేదు. అయితే ఇప్పుడు ఆ రూల్ మారింది. ఇక‌నుంచి స‌మీపంలోని పోస్టాఫీస్‌కి వెళ్లి నిరుద్యోగులు రిజిష్ట‌ర్ చేసుకునే వెసులుబాటును కేంద్రం క‌ల్పిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులు ఎంప్లాయ్‌మెంట్‌ రిజిస్ట్రేషన కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ మేరకు కార్మిక శాఖకు, తపాలా వ్యవస్థకు మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. రెండు శాఖలు కలిసి సంయుక్తంగా ఓ వెబ్‌ పోర్టల్‌ను రూపొందించాయి. ఈ వెబ్‌సైట్‌లో ఇటు నిరుద్యోగులతోపాటు అటు సంస్థల యజమానులు కూడా రిజిస్ట్రేష‌న్‌ చేసుకుంటారు. తద్వారా ఇటు ఉద్యోగార్ధులకు, అటు మానవ వనరులు కావాల్సిన సంస్థలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది.

నేడు కేంద్ర‌మంత్రి ద‌త్తాత్రేయ చేతుల‌మీదుగా ఈ పోర్ట‌ల్ ప్రారంభ‌మైంది.. ఇప్పటికే పోస్టల్‌/రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో 20 వేల మంది ఉద్యోగార్థులు, 7వేల సంస్థల యజమానులు అప్‌లోడ్ అయ్యారు. సుమారు 7వేల మందికి ఉద్యోగాలు కూడా దక్కాయని ద‌త్తాత్రేయ తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను అందించేందుకు ‘నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌’ వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించామ‌ని ఆయ‌న తెలిపారు.