ఏకంగా ఆ ట్రిపుల్ ఐటి లోనే కరెంట్ కోత?

Sunday, March 11th, 2018, 04:40:50 PM IST

ఒకవైపు కరెంట్ కష్టాలు లేకుండా చూస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెపుతున్నప్పటికీ ఏకంగా ఒక ట్రిపుల్ ఐటి సంస్థలోనే విద్యుత్ సమస్య తలెత్తడం కలకలం రేపుతోంది. విషయం లోకి వెళితే ఇటీవల కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యుత్తు లేక విద్యార్ధులు అవస్థలు పడుతున్నట్లు ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో ప్రసారమైన విషయం తెలిసిందే. దాదాపు 8500 మంది విద్యార్థులు ఈ సందర్భంగా అవస్థలు పడుతున్న విషయమై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది నుంచి ట్రిపుల్‌ ఐటీ అధికారులను విద్యుత్‌ సరఫరా అంతరాయానికి గల కారణాలు, తీసుకుంటున్న చర్యలను ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ వెంకటదాసు ను అడిగి తెలుసుకున్నారు.

ఈనెల 9వ తేదీన ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మత్తుకు గురికావడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ వెంకటదాసు తెలిపారు. ఈరోజు సాయంత్రంలోగా సరఫరా సాధారణ స్థితికి చేరేలా పనులు జరుగుతున్నాయని ఆయన అధికారులకు చెప్పారు. విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అన్ని విధాలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రస్తుతం జనరేటర్ల సహాయంతో క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్ధుల పరీక్షల సమయం సమీపిస్తోన్న దృష్ట్యా మున్ముందు ఈ తరహా ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని ట్రిపుల్‌ ఐటీ అధికారులను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించినట్లు తెలుస్తోంది…

  •  
  •  
  •  
  •  

Comments