`సాహో` తేల‌కుండానే `జిల్‌` డైరెక్ట‌ర్‌తో సెట్స్‌పైకి?

Wednesday, January 17th, 2018, 10:37:12 PM IST

బాహుబ‌లి -2 త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న అత్యంత క్రేజీ మూవీ `సాహో`. దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా 2018 మోస్ట్ అవైటెడ్ మూవీగా భావిస్తున్నారంతా. అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో కొన్ని అడ్డంకులు చికాకు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ కాన్వాసుతో తెర‌కెక్కుతున్న ఈ యాక్ష‌న్ చిత్రానికి లొకేష‌న్లు స‌హా ప్ర‌తిదీ అత్యంత కీల‌కం. వీట‌న్నిటినీ మించి వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ అంతే ముఖ్యం. అయితే స‌రిగ్గా ఇవే కార‌ణాలు ప్ర‌భాస్‌లో కొత్త ఆలోచ‌న‌కు పురుడు పోశాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఓ సినిమా సెట్‌లో ఉండ‌గా వేరొక సినిమాలో న‌టించేందుకు ఇష్ట‌ప‌డ‌ని డార్లింగ్ ఈసారి ఆలోచ‌న మార్చుకున్నార‌ని తెలుస్తోంది.

`సాహో` ఎలానూ లేట‌వుతోంది. ఈ సినిమాలో త‌న పార్ట్‌ని సాధ్య‌మైనంత తొంద‌ర‌గా పూర్తి చేసేస్తే, అటుపై సుజిత్ నుంచి రివీలైపోయి, జిల్ ఫేం రాధాకృష్ణ‌తో సినిమా చేసుకోవ‌డం ఈజీ అవుతుంద‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడుట‌. అందుకు త‌గ్గ‌ట్టే ప్లానింగ్‌లో స్పీడ్ పెంచాడ‌ని చెబుతున్నారు. సుజిత్‌తో పాటు రాధాకృష్ణ‌కు ఒకేసారి అవ‌కాశం ఇచ్చాడు. అయితే సాహో ముందుగా సెట్స్‌కెళ్ల‌డంతో రాధా వెయిటింగులో ఉన్నాడు. ఇంకో ఏడాది వ‌ర‌కూ వేచి చూడ‌డం అంటే ఎంత కొత్త ద‌ర్శ‌కుడికి అయినా క‌ష్ట‌మే. అందుకే సాహో లో త‌న షూటింగ్ పార్ట్‌ పూర్త‌య్యాక‌, రాధాకృష్ణ‌తోనూ సినిమా మొద‌లెట్టేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడుట ప్ర‌భాస్‌. దీనిపై చ‌ర్చించేందుకు ఫిబ్ర‌వ‌రి లేదా మార్చిలో ప్ర‌భాస్- రాధాకృష్ణ స‌మాలోచ‌న‌లు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మార్చి నాటికి పూర్తిగా ఈ విష‌యంలో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అలాగే భారీ కాన్వాసుతో తెర‌కెక్కుతున్న `సాహో` వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.