స్పెషల్ వీడియో : మహానటి చిత్రంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూశారా..?

Tuesday, May 8th, 2018, 12:16:18 PM IST

తెలుగు తెర‌పై చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల న‌టి సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. చిత్ర పరిశ్రమకి ఆ కాలంలోనే చెరగని వన్నె తెచ్చి ఒక నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, గొప్ప తల్లిగా మహా నటిగా యావత్ భారత దేశం గర్వించే విధంగా ఎదిగిన స్త్రీ సావిత్రి. రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రంకి యూ స‌ర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్‌. 2 గంటల 59 నిమిషాల ర‌న్‌టైం ఈ చిత్రానికి ఉండ‌డంతో సినిమాలో ఏఏ అంశాలు చూపిస్తారా అని అభిమానుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. అయితే కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించి పాత్ర‌లు ప‌రిచ‌యం చేస్తూ వ‌స్తున్న యూనిట్ తాజాగా ప్ర‌కాశ్ రాజ్ పాత్ర ప‌రిచ‌యం చేశారు. చ‌క్ర‌పాణి పాత్ర‌లో ప్ర‌కాశ్ రాజ్ క‌నిపించ‌నున్నారు. చ‌క్రపాణిగారి గురించి ఈ తరం వారికి తెలిసింది చాలా తక్కువ అంటూ ‘నాని’ వాయిస్ ఓవర్ ద్వారా ఆ పాత్రను గురించి వీడియోలో చెప్పారు . తెలుగు సినిమాపై కథా రచయితగా .. దర్శక నిర్మాతగా చక్రపాణి తనదైన ముద్రవేశారు. సావిత్రి కథానాయికగా ఎదగడంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో చ‌క్ర‌పాణి ఒక‌రు . అలాంటి ఆయన లుక్ తో ప్రకాశ్ రాజ్ స‌రికొత్తగా కనిపిస్తున్నారు. మ‌హాన‌టి చిత్రం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌గా కీర్తి సురేష్ సావిత్రి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్ బాబు, అవసరాల శ్రీనివాస్, షాలినీ పాండే, మాలినీ నిర్, రాజేంద్రప్రసాద్ లు ముఖ్య పాత్ర‌లు పోషించారు.