సుకుమార్..? అసలు సినిమా ఈసారైనా రిలీజ్ అవుతుందా..?

Wednesday, March 7th, 2018, 04:10:22 PM IST

సినిమా మనిషి ఊహాగానాలకి అందని రీతిలో ఒక కథను సృష్టించి దానికి ఒక ప్రాణం పోసి ఎందరో నటీ నటులను జోడించి మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. ఇంతటి కష్టతరమైన పనిలో కీలక పాత్ర పోషించేవాడు డైరెక్టర్. డైరక్టర్ అనే వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, అతని కథకి మూలధనాన్ని సమకూర్చే నిర్మాతను గాబరా పెట్టకుండా ఉండే మనిషై ఉండాలి. ఇక సుకుమార్ విషయానికొస్తే అతను మంచి దర్శకుడే. మేధావే. అదంతా సరే కానీ నిర్మాతలను మాత్రం టెన్షన్ ఫ్రీగా వుంచలేకపోతున్నారు. ఇది పైకి బహిరంగంగా నిర్మాతలు ఒప్పుకోకపోవచ్చు. కానీ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న సంగతి అయితే మాత్రం కచ్చితంగా ఇదే. ఎందుకంటే రంగస్థలం సినిమాను ఎప్పుడు మొదలుపెట్టారు. ఎన్ని డేట్లు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఇంకా సినిమాకి సంబందించిన ప్రోడక్ట్ ను సిద్దం చేయలేకపోతున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇక మూడువారాల్లోకి వచ్చింది. చివరి వారం అంతా డిజిటల్ అప్ లోడింగ్, ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. అంటే మిగిలింది రెండు వారాల సమయం.

కానీ ఇప్పటి వరకు సెన్సారుకు ఆన్ లైన్ లో అప్లయ్ చేయలేదు. సరే, ఇంకా టైమ్ వుందిగా అనుకుంటే, ఇంకా ఎడిటింగ్ ఫైనల్ చేసి, ఫస్ట్ కాపీ కూడా లాక్ చేయలేదని సినీ వర్గాల సమాచారం. సినిమా ఇప్పటికి లెటెస్ట్ కట్, రెండు గంటల నలభై నిమషాల వరకు వచ్చిందని తెలుస్తోంది. కానీ అంత నిడివిని వుంచలేరు. మరి ఏ మేరకు తగ్గించేదీ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అంటే ఏడిటింగ్ ఫైనల్ కట్ లాక్ కలేదన్నట్లే కదా? అజ్ఞాతవాసి అడ్డం వచ్చింది అనుకుంటే అది సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా. అది అడ్డం వచ్చిందని డేట్ అనౌన్స్ చేసి కూడా వెనుదిరిగారు. కానీ ఇప్పటికి అంటే, ఆ డేట్ దాటిన రెండు నెలలకు కూడా కాపీ రెడీ కాకపోవడం అంటే నిర్మాతను టెన్షన్ పెట్టడం తప్ప వేరేమిటి? దీనికి సుకుమార్ ఏమడిగినా సమాధానం చెప్పలేకపోతున్నాడట. చివరికి ఏం చేస్తాడో మరి వేచి చూడాల్సిందే.