సినీ పరిశ్రమ మొత్తం జగన్ గారి ముందు నిలబడాలా పృథ్వి

Friday, June 14th, 2019, 02:45:49 PM IST

గత ఎన్నికల్లో వైకాపాలో సినీ తారలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. పృథ్వి, పోసాని, మోహన్ బాబు, అలీ, చిన్ని కృష్ణ, ఇంకా చిన్నా చితకా నటీనటులు చాలామంది జగన్ తరపున నిలబడి మాట్లాడారు. ఆయన్ను గెలిపించడానికి పనిచేశారు. వారు అనుకున్నట్టే జగన్ గెలిచారు. ఇప్పుడు పార్టీలో భవిష్యత్ వెతుక్కుంటున్నారు. ఈ వ్యవహారమంతా వారి వ్యక్తిగతం. కానీ తమతో పాటే మిగతా పరిశ్రమ మొత్తం జగన్ ముందు నిలబడాలని అంటే ఎలా కుదురుతుంది.

కానీ నటుడు పృథ్వి ఇదే డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా సురేష్ బాబు, రాఘవేంద్రరావు, చిరంజీవి, అల్లు అరవింద్ లాంటి వాళ్ళను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ కమెడియన్ తాజాగా గుంటూరులో మాట్లాడుతూ భారీ మెజారిటీతో గెలిచిన జగన్ సినీ పెద్దలకు కనిపించడంలేదా, సినిమా వాళ్ళను నమ్మకండి అంటూ మండిపడిపోయారు. జగన్ గెలుపు కనబడటంలేదా అనడంలో ఆయన ఉద్దేశ్యం సినీ పరిశ్రమ కొత్త ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలనే ధోరణి అధికంగా కనిపిస్తోంది. ఈ ధోరణి వెనుక జగన్ అనునాయులుగా పేరు తెచ్చుకున్న తాము ఇండస్ట్రీలో కీలకంగా మారొచ్చనే భావన ఉందో లేకపోతే ఇంకేదైనా ప్రయోజనం ఉందో ఆయనకే తెలియాలి.