పూరీ జగన్నాథ్ మేనియా కి మళ్ళీ బ్రేక్ వస్తుందా? ట్రేడ్ మార్క్ ట్రెండ్ తప్పింది!

Thursday, September 28th, 2017, 11:41:19 AM IST


క‌మ‌ర్షియ‌ల్ సినిమా రూపు రేఖ‌ల్ని మార్చిన ద‌ర్శ‌కుల్లో ఏ.కోదండ‌రామిరెడ్డి, కె.రాఘ‌వేంద్ర‌రావు వంటి ప్ర‌ముఖుల పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తాయి. 90ల‌లో మ‌లుపు తిప్పిన ద‌ర్శ‌కులు వీళ్లు అని చెబుతారు. ఆ క్ర‌మంలోనే త‌ర్వాతి జ‌న‌రేషన్‌లో పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌దైన మార్క్‌తో సినిమాలు తీసి డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. హీరోయిజంని, క‌మర్షియ‌ల్ సినిమా స్థాయిని మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లాడ‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. పూరి త‌న‌దైన మార్క్ డైలాగుల‌తోనూ ఆడియెన్‌ని ర‌క్తి క‌ట్టించాడు. ఇండ‌స్ట్రీలో ఉన్న స్టార్ హీరోలంద‌రితోనూ సినిమాలు తీశాడు. రిలీజ్ తేదీ ముందే చెప్పి చెప్పిన టైమ్‌కి సినిమా తీసే ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌ల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. డెబ్యూ హీరోల్ని తెర‌కు ప‌రిచ‌యం చేయాల‌న్నా పూరినే స‌రైన ద‌ర్శ‌కుడు అని భావించేంత‌టి క్రేజు అత‌డి సొంతం.

అయితే ఇటీవ‌లి కాలంలో వ‌రుస ప‌రాజ‌యాలు పూరిని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అత‌డు ఎంచుకుంటున్న క‌థ‌ల్లో మోనోప‌లి స్థాయిని దిగ‌జార్చింద‌నే చెప్పాలి. హీరో యారొగెన్సీలో రొటీనిటీ జ‌నాల‌కు న‌చ్చ‌డం లేదు. ఓ ర‌కంగా మారుతున్న ట్రెండ్‌, ప్రేక్ష‌కాభిరుచిని పూరి సినిమాలు ప్ర‌తిబింబించడం లేదు అన్న అప‌ప్ర‌ద ఉంది.
నువ్వు నంద అయితే నేను బద్రి,.. బద్రినాథ్! అంటూ ప‌వ‌న్‌తో, కమీషనర్ కూతుళ్లు పెళ్లి చేసుకోరా..మొగుళ్లు రారా! అంటూ మాస్‌రాజా ర‌వితేజ‌తో, ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు! అంటూ మ‌హేష్‌తో..పంచ్‌లు వేయించాడు. ఇలా రౌండ‌ప్ చేసి క‌న్ఫ్యూజ్‌చేయొద్దు.. క‌న్ఫ్యూజ‌న్‌లో ఎక్కువ కొట్టేస్తా! .. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే .. ఎయిమ్ ఫ‌ర్ లెవంత్ మైల్‌..! అంటూ భారీ పంచ్ డైలాగ్‌ల‌తో యూత్‌ని మెప్పించాడు. టాప్ హీరోలు, న‌వ‌త‌రం హీరోల్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తీయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఇటీవ‌లి కాలంలో ముందుకెళుతున్న పూరి ప్ర‌స్తుతం త‌న‌యుడు ఆకాష్‌పూరిని క‌మ‌ర్షియ‌ల్ హీరోగా తీర్చిదిద్దే స‌న్నాహాల్లో ఉన్నాడు. ఆకాష్ నటించే త‌దుప‌రి చిత్రం `మెహ‌బూబా` టైటిల్‌ని నేడు పూరి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆవిష్క‌రించారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా కింగ్‌.. మ‌ళ్లీ మునుప‌టి మెరుపులు ఎప్పుడు. త‌న‌యుడి సినిమాతోనే రీఛార్జ్ అవుతాడా? చూడాలి. (నేడు పూరి జ‌గ‌న్నాథ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా)

  •  
  •  
  •  
  •  

Comments