పదో తరగతి పరీక్షలో కోహ్లీ గురించి ప్రశ్న!

Thursday, March 15th, 2018, 04:23:00 PM IST

స్కూల్ దశలో పిల్లలకు బయటి ప్రపంచం గురించి కూడా అవగాహనా ఉండాలని ఈ రోజుల్లో విద్యా విధానాల్లో ప్రభుత్వాల్లో చాలా మార్పులను చేస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గురించి తెలియని వారు ఎవరైనా ఉంటారా?. క్రికెట్ గురించి తెలిసిన వారు అయితే తప్పకుండా కోహ్లీ బయోడేటా మొత్తం చెప్పేస్తారు. నేటి యువతరానికి ఎంతో స్పూర్థిగా నిలిచినా కోహ్లీకి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విధంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ గురించి పరీక్షలో 10 మార్కుల ప్రశ్నలు అడిగితే ఎలా ఉంటుంది.

ఎవ్వరైనా సరే ఎగ్జామ్ హాల్ లోనే ఎగిరి గంతేస్తారు. అదే తరహాలో పశ్చిమ బెంగాల్ విద్యార్థులు కూడా ఎంతో సంబరపడ్డారు. ప్రస్తుతం అక్కడ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లీష్‌ పరీక్షలో పదిమార్కులకు విరాట్ కోహ్లీ గురించి రాయమని చెప్పారు. దీంతో విద్యార్థులు కోహ్లీ మీద ఉన్న అభిమానంతో కొంచెం ఎక్కువగానే రాసారు. పరీక్షా హాలు నుంచి విద్యార్థులు చాలా సంతోషంగా వచ్చారు అని అక్కడి మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. 10 మార్కులు పోయే పరిస్థితి లేదని విద్యార్థులకు గట్టిగా సమాధానం ఇస్తున్నారు.