కెసిఆర్ ను విమర్శించడం తగదు!

Saturday, October 18th, 2014, 05:23:08 PM IST

rajayah
తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య శనివారం కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ సమస్యల పరిష్కారంలో తెరాస సర్కారు విఫలమైందన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే రాజయ్య మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ కష్టాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణమైతే, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను విమర్శించడమేమిటని రాజయ్య నిలదీశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై అర్ధంలేని వ్యాఖ్యలు చెయ్యడం తగదని, కెసిఆర్ ని అంటే ఆ సూరీడుపై ఉమ్మేసినట్లేనని పేర్కొన్నారు. అలాగే రైతుల ఆత్మహత్యలపై పదేళ్లుగా మాట్లాడని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ధర్నాలకు దిగడం అర్ధరహితమని రాజయ్య విమర్శించారు. ఇక రైతుల ఆత్మహత్యలకు కెసిఆరే కారణమని, విద్యుత్ సమస్యను పరిష్కరించి రైతుల ఆత్మహత్యలు అరికట్టే వరకు కాంగ్రెస్ నేతలు కెసిఆర్ గుండెల్లో నిద్రపోతారని తెలంగాణ పిసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించిన సంగతి తెలిసిదే. కాగా దీనికి సమాధానంగానే ఉపముఖ్యమంత్రి రాజయ్య పై వ్యాఖ్యలు చేశారు.